ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా.
వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్‌ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్‌ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్‌ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్‌ఓలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్‌ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్‌ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది.


