ఢిల్లీలో మమత.. ఈసీపై తీవ్ర ఆరోపణలు | CM Mamata Banerjee Allegations On EC after SIR meeting | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మమత.. ఈసీపై తీవ్ర ఆరోపణలు

Feb 2 2026 8:10 PM | Updated on Feb 2 2026 8:24 PM

CM Mamata Banerjee Allegations On EC after SIR meeting

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సర్‌(SIR) విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టి.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం, మమతా బెనర్జీ.. సీఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈసీతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మమత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎల్‌కే అద్వానీ గారిని గౌరవిస్తాను. ఆయన తన తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అందించగలరా అని అడుగుతున్నాను. ‘సర్‌’ పొంతన లేనిది. తప్పుల తడకగా ఉంది, అసంబద్ధమైనది. ఈ ఎన్‌ఆర్‌సీ కారణంగా బీఎల్‌ఓలతో సహా 150 మందికి పైగా మరణించారు. నేను నా వెంట 100 మందిని తీసుకువచ్చాను. వారిలో కొందరిని ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారు సజీవంగా ఇక్కడే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.  

సర్‌ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించం. ఆయన మా మాటల్ని వినలేదు.. మమ్మల్ని అవమానించారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్‌లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు అని అన్నారు.

అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement