ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో 'నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్' ఆధ్వర్యంలో ఈ నెల 25న అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్ (ట్విటర్) వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిపబ్లిక్ డే వేళ స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటాం కానీ, మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత కరువయ్యాయని’ అంటూ తనకు ఎదురైన చేదు ఘటన గురించి వివరించింది.
As we celebrate Republic Day, we speak of freedom and equality.
But the independence and dignity of women and artists are still too easily violated.
I have built my image and career on my own over the years. Staying silent today would only normalise the humiliation of artists.…— Mimi chakraborty (@mimichakraborty) January 26, 2026


