వివాదాస్పద లిరిసిస్ట్‌పై ప్రశంసలు.. కమల్ హాసన్‌కు చిన్మయి చురకలు..! | Singer Chinmayi Slams Kollywood Hero Kamal Haasan about Vairamuthu | Sakshi
Sakshi News home page

Chinmayi: వివాదాస్పద లిరిసిస్ట్‌కు ప్రశంసలు.. కమల్ హాసన్‌కు చిన్మయి చురకలు..!

Mar 14 2026 6:39 PM | Updated on Mar 14 2026 7:13 PM

Singer Chinmayi Slams Kollywood Hero Kamal Haasan about Vairamuthu

వివాదాస్పద లిరిసిస్ట్‌ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్‌, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్‌తో జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.

చిన్మయి చురకలు..

వైరముత్తుకు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్‌ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్‌ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం,  తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని  ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. 

ఇక్కడ  ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement