న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో నివసించే ఆధునిక దంపతులకు పిల్లలను కనడం, వారిని పెంచడం ఆర్థికంగా ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి బిడ్డకు ఆరు నెలలు వచ్చేసరికి అక్షరాలా రూ. 4 లక్షల వరకు ఖర్చయిందంటూ ‘అయాన్ చక్రవర్తి’ అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘డాడ్ డైరీస్’ పేరుతో ఆయన పంచుకున్న ఈ లెక్కలు నేటి పేరెంటింగ్‌లోని అసలు ఆర్థిక వాస్తవాలను కళ్లకు కట్టాయి.
గర్భధారణ కాలం నుంచే మొదలవుతున్న ఖర్చులు
అయాన్ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. భార్య గర్భం దాల్చిన మొదటి రోజు నుంచే ఖర్చుల పర్వం మొదలైంది. క్రమం తప్పకుండా డాక్టర్ విజిట్స్, స్కాన్‌లు, రక్త పరీక్షలు, మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గర్భధారణ సమయంలో కేవలం మందులు, సప్లిమెంట్ల కోసమే నెలకు రూ. 1,500 నుండి ₹2,000 వరకు ఖర్చయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఆసుపత్రిలో డెలివరీ బిల్లు విషయానికి వస్తే, అది రూ.1.2 లక్షల నుండి రూ.1.5 లక్షలకు చేరిందని ఆయన వివరించారు.
పసిబిడ్డ రాకతో వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్లు
పాప పుట్టిన తర్వాత ప్రారంభ నెలల్లో కొన్ని వస్తువుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. బిడ్డ పడుకునే ఉయ్యాల (క్రిబ్) కోసం రూ. 9,000 నుండి రూ. 15,000 వరకు, బట్టల కోసం రూ.7,000 నుండి రూ.8,000 వరకు ఖర్చయింది. వీటితో పాటు ఫీడింగ్ బాటిళ్లు, స్టెరిలైజర్లు, ఇతర అత్యవసర వస్తువుల కొనుగోలు కోసం దాదాపు రూ. 10,000 వరకు వెచ్చించాల్సి వచ్చినట్లు అయాన్ తన వీడియోలో లెక్కలు గట్టి చూపించారు.
ప్రతి నెలా తప్పనిసరిగా..
బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల్లో ప్రతి డాక్టర్ కన్సల్టేషన్‌కు రూ.1,200 చొప్పున ఖర్చవగా, వ్యాక్సినేషన్లు (టీకాలు) అత్యంత ఖరీదైనవిగా మారాయి. వీటికి తోడు నెలకు డైపర్ల కోసం రూ. 3,000 నుండి రూ. 4,000, ఫార్ములా మిల్క్ కోసం మరో రూ. 3,000 నుండి రూ. 4,000, ఆటబొమ్మలు, ఇతర వస్తువుల కోసం నెలకు రూ. 2,500 వరకు ఖర్చవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి సంపాదనతో మెట్రో నగరాల్లో పిల్లల్ని పెంచడం సామాన్యులకు కష్టతరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత టీకాలు వేయించుకోవచ్చని, ఖరీదైన వస్తువులు తగ్గించుకుంటే ఈ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని కొందరు నెటిజన్లు కామెంట్ల రూపంలో సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘వందేభారత్’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు!


