మెట్రో అనుమతులపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్ధం
ఎస్‌బీఐ భూవివాదంపై ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేసే అవకాశం.. హైకమాండ్‌తో మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం రాత్రి ముంబై మీదుగా హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి కేంద్ర మంత్రులతో కీలక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణ, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో నేరుగా తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మెట్రో రైలు పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.
‘ఈ నెల 22, 23 తేదీల్లో నేను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాను. మీరు చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి’అని రేవంత్ లేఖలో కోరారు. అలాగే, రాయదుర్గంలో ఎస్‌బీఐ భూమి వేలం వివాదానికి సంబంధించి రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్‌బీఐ చైర్మన్‌పై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన పనులతోపాటు, రాష్ట్ర రాజకీయాలపైనా సీఎం దృష్టి సారించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీలను కలవనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంది.


