బెలూన్లు నింపుతుండగా పేలుడు | Balloon Gas Cylinder Explodes Near Hyderabad GSM Mall | Sakshi
Sakshi News home page

బెలూన్లు నింపుతుండగా పేలుడు

Aug 9 2026 7:57 AM | Updated on Aug 9 2026 7:57 AM

 Balloon Gas Cylinder Explodes Near Hyderabad GSM Mall

హైదరాబాద్: మదీనాగూడలోని జీఎస్‌ఎం మాల్‌ వద్ద శనివారం సాయంత్రం బెలూన్లలో గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ అకస్మాత్తుగా పేలడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి కాలు తెగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్‌ జయరాం తెలిపిన ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అవినాష్‌ అనే యువకుడు జీఎస్‌ఎం మాల్‌ ముందు సైకిల్‌పై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టుకొని గ్యాస్‌ బెలూన్లు విక్రయిస్తుంటాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో బెలూన్‌లో గ్యాస్‌ నింపుతుండగా ఒక్కసారిగా సిలిండర్‌ భారీ శబ్ధంతో పేలింది. 

దీంతో అక్కడే ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌ పాల్‌ కుడి కాలుకు సిలిండర్‌ ముక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు కింది భాగం తెగి పడింది. అలాగే అదే రూట్లో వెళ్తున్న కొండాపూర్‌కు చెందిన ఎం.జనార్ధన్, శ్రీ చైతన్య కళాశాలకు చెందిన ఎన్‌.ధనూషకు కూడా గాయాలయ్యాయి. సింధుప్రియ అనే మహిళ షాపింగ్‌ పూర్తి చేసుకొని కారులో కూర్చున్న సమయంలో సిలిండర్‌ పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలి గాయాలయ్యాయి. 

అక్కడే ఉన్న మరికొందరికి కూడా చిన్న చిన్న గాయాలైనట్లు  చెప్పారు. సమాచారం అందుకున్న మియాపూర్‌ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాలు తెగిపడిన వివేక్‌ పాల్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్‌కు కూడా చేతికి గాయమైందని, పేలుడు జరగ్గానే అక్కడ నుండి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.   

ఉలిక్కిపడిన స్థానికులు 
రద్దీ ప్రాంతంలో అకస్మాత్తుగా సంభవించిన పేలుడుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాల్‌లోకి వెళ్లే మార్గం పక్కనే పేలుడు జరగడంతో చాలా మంది గాయపడ్డారు. అసలేం జరిగిందో తెలియక రోడ్డు వెంట వెళ్లే వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement