కొంచెం మా కుక్కను దింపరూ! | Hyderabad Bike Riders Receive Bizarre Requests Every Day | Sakshi
Sakshi News home page

కొంచెం మా కుక్కను దింపరూ!

Aug 9 2026 5:47 AM | Updated on Aug 9 2026 5:47 AM

Hyderabad Bike Riders Receive Bizarre Requests Every Day

కాస్త గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేయండి

ప్రతి 10 రైడ్‌లలో ఒకటి ఇలాంటిదే.. 

నిబంధనలకు విరుద్ధమంటూ సున్నితంగా తిరస్కరిస్తున్న రైడర్లు

హైదరాబాద్‌లో బైక్‌ రైడర్లకు నిత్యం వింత అభ్యర్థనలు

రోడ్డుపై వరదనీరు దాటేందుకూ బైక్‌ ట్యాక్సీలు బుక్‌ చేస్తున్న కొందరు

పార్కింగ్‌లో ఉన్న బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాలంటూ ఓ వ్యక్తి బుకింగ్‌

నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలను దూరం చేస్తూ వారిని అతితక్కువ చార్జీకే గమ్యం చేరుస్తున్న బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లకు కొందరు వినియోగదారులు వింత రిక్వెస్ట్‌లతో చుక్కలు చూపిస్తున్నారు. అత్యవసర సాయం కింద సామగ్రిని, జంతువులను, చిన్న పిల్లలను కూడా నిర్దేశిత గమ్యానికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. రోజుకు సగటున 1.2 లక్షల రైడ్‌లు బుక్‌ అవుతున్న నగరంలో ప్రతి 10 రైడ్‌లలో ఒకటి ఇలాంటి వింత డిమాండ్‌ ఉంటోందని.. కస్టమర్ల క్రియేటివిటీకి హద్దే లేకుండా పోతోందని రైడర్లు వాపోతున్నారు.

స్కూల్‌ బస్‌ రాలేదని..: ఉప్పల్‌లో ఉన్న రాజేశ్‌ అనే రైడర్‌కు రైడ్‌ అలర్ట్‌ వచ్చింది. లొకేషన్‌కు వెళ్లేసరికి ఓ మహిళ చేతిలో స్కూల్‌ బ్యాగ్, 6 ఏళ్ల పిల్లాడితో నిల్చుంది. ‘అన్నా.. ఇవాళ స్కూల్‌ బస్‌ రాలేదు. కొంచెం మా బాబును 4 కి.మీ దూరంలో ఉన్న స్కూల్‌ వద్ద దింపండి’ అని ఆమె రైడర్‌ను బతిమి­లాడింది. అయితే మైనర్‌ను ఒంటరిగా తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమ­ని.. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆ రైడర్‌ సున్నితంగా రైడ్‌ను క్యాన్సిల్‌ చేశాడు. ‘వారానికి 2–3 సార్లు ఇలాంటివి వస్తాయి. 40 రూపాయల కోసం లైసెన్స్‌ పోగొట్టుకోలేం కదా. అందుకే క్యాన్సిల్‌ చేస్తుంటా’ అని రాజేశ్‌ చెప్పాడు.

ల్యాబ్రడార్‌ను కుత్బుల్లాపూర్‌ తీసుకెళ్లాలని..: మియాపూర్‌కు చెందిన ప్రవీణ్‌ అనే బైక్‌ ట్యాక్సీ రైడర్‌కు సైతం ఈ తరహాలో ఓ వింత రైడ్‌ వచ్చింది. అతను తీరా కస్టమర్‌ లొకేషన్‌కు చేరుకోగానే అతని చేతిలో ల్యాబ్రడార్‌ కుక్క కనిపించింది. ‘క్యాబ్‌ క్యాన్సిల్‌ అయింది అన్నా.. కాస్త దీన్ని కుత్బుల్లాపూర్‌లో ఉన్న ఇంటికి డ్రాప్‌ చేయండి. మీ ఒడిలో కూర్చోబెడతా’ అని కస్టమర్‌ కోరాడు. కానీ బైక్‌పై జంతువుల రవాణా నిషిద్ధమని చెప్పి ఆ రైడర్‌ వెళ్లిపోయాడు.

ఇలాంటి పెట్‌ ట్యాక్సీ రిక్వెస్ట్‌లు ఇటీవల పెరుగుతున్నట్లు పలువురు రైడర్లు చెప్పారు. ‘కూకట్‌పల్లిలో రోడ్డుపై నీళ్లు ఉన్నాయి, కేవలం 50 మీటర్లు డ్రాప్‌ చేయండి’ అని 19 రూపాయలకు వచ్చిన రైడ్‌తోపాటు ఎల్బీనగర్‌లో ‘రెండు గ్యాస్‌ సిలిండర్లు తీసుకెళ్లాలి’ అంటూ వచ్చిన రైడ్‌ రిక్వెస్ట్‌ కూడా రైడర్లను అవాక్కు చేసింది. అలాగే గచ్చిబౌలిలో ఓ ఐటీ ఉద్యోగి ‘నా బైక్‌ను కాస్త ఇంటికి తీసుకెళ్లండి’ అని అడిగిన ఘటన కూడా ఉంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?..: బైక్‌ ట్యాక్సీ సేవలు అందించే సంస్థల నిబంధనల ప్రకారం ప్రతి రైడ్‌లో కేవలం ప్యాసింజర్లనే దించాలి. సామాన్లు, జంతువులు, మైనర్ల రవాణాకు అనుమతి లేదు. అయినా వినియోగదారులు ఒత్తిడి చేస్తున్నారని రైడర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement