ఎరువు తగ్గినా దిగుబడి పెరిగింది! | Yields increased despite reduced fertilizer in Telangana | Sakshi
Sakshi News home page

ఎరువు తగ్గినా దిగుబడి పెరిగింది!

Aug 9 2026 5:37 AM | Updated on Aug 9 2026 5:37 AM

Yields increased despite reduced fertilizer in Telangana

జీపీఎస్‌తో నేల మ్యాపింగ్‌.. తెలంగాణలో కొత్త సాగు పద్ధతి 

నత్రజని 38.6%.. భాస్వరం 100%.. పొటాష్‌ 50% ఆదా 

గుంటూరుపల్లిలో 1,000 హెక్టార్ల వరి సాగుపై అధ్యయనం 

అగ్రి యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం తదితర శాస్త్రవేత్తల పరిశోధన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సాధారణంగా పంటల సాగుకు ఎరువుల వినియోగం ఎక్కువే. ఎంత ఎక్కువ ఎరువు వేస్తే అంత పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుందని చాలామంది  రైతులు భావిస్తుంటారు. అయితే, దీనికి భిన్నంగా ఎరువులు తగ్గినా దిగుబడిని పెంచవచ్చని తాజా పరి శోధన ఒకటి పేర్కొంది. అందుకు తగిన పద్ధతులు సూచించింది.  నేల స్వభావం, పోషకాల లభ్యతను జీపీఎస్‌ ఆధారిత మ్యాపింగ్‌తో గుర్తించి.. పొలంలో ఏ ప్రాంతానికి ఎంత ఎరువు అవసరమో నిర్ధారిస్తే ఎరు వుల వినియోగాన్ని భారీగా తగ్గించడంతోపాటు దిగు బడిని పెంచవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలోని హనుమ కొండ జిల్లా హసన్‌పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో 1,000 హెక్టార్ల వరి సాగు ప్రాంతంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం తదితర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాలు జూలై 13న ఫ్రంటియర్స్‌ ఇన్‌ సాయిల్‌ సైన్స్‌లో ప్రచురితమయ్యాయి. 

200 చోట్ల మట్టి నమూనాలు
పరిశోధనలో భాగంగా 2024లో గుంటూరుపల్లి పరిధిలోని వ్యవసాయ భూముల్లో 200 భౌగోళిక స్థానాలను గుర్తించి మట్టి నమూనాలు సేకరించారు. ప్రతి నమూనా స్థానం అక్షాంశ, రేఖాంశాలతో జీపీఎస్‌లో నమోదు చేశారు. మట్టి పీహెచ్, విద్యుత్‌ వాహకత, సేంద్రియ కర్బనం, అందుబాటులోని నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి అంశాలను పరీక్షించారు. ఆ వివరాలను భౌగోళిక గణాంక పద్ధతులతో విశ్లేషించి నేల సారాన్ని బట్టి మూడు వేర్వేరు నిర్వహణ మండలాలు గుర్తించారు. అంటే రైతు పొలం మొత్తానికి ఒకే ఎరువుల మోతాదు కాకుండా ఏ ప్రాంతంలో ఎంత పోషకం ఉందో, ఎక్కడ ఎంత లోపం ఉందో గుర్తించి ఆ మేరకే ఎరువు వేయడం అన్నమాట. 

నత్రజని 38.6%.. భాస్వరం పూర్తిగా ఆదా
సాంప్రదాయ రైతు పద్ధతితో పోలిస్తే నేల ఆధారిత సిఫార్సులతో నత్రజని వినియోగం గరిష్ఠంగా 38.6 శాతం, భాస్వరం 100 శాతం, పొటాష్‌ 50 శాతం వరకు తగ్గింది. అయినప్పటికీ పంట దిగుబడి తగ్గలేదు. దీనికి విరుద్ధంగా దిగుబడి ఎకరానికి సుమారు 21.4 క్వింటాళ్ల నుంచి 26.8 క్వింటాళ్లకు సమానమైన స్థాయికి పెరిగింది. అధ్యయనంలో హెక్టారుకు 53 క్వింటాళ్ల నుంచి 67 క్వింటాళ్ల వరకు దిగుబడి నమోదైంది. ఎరువుల ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం కలసి రైతు లాభాన్ని కూడా పెంచాయి. సంప్రదాయ ఎరువుల పద్ధతిలో హెక్టారుకు నికర లాభం రూ.50,480గా ఉండగా.. ఉత్తమ నిర్వహణ మండలంలో ఇది రూ.93,415కు చేరింది. అంటే 85 శాతం పెరుగుదల నమోదైంది. ప్రయోజనం–వ్యయ నిష్పత్తి కూడా 1.66 నుంచి 2.40కు పెరిగింది.

గుంటూరుపల్లి నుంచి.. రాష్ట్రమంతా సాధ్యమేనా?
ఈ పరిశోధన ప్రస్తుతం ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 1,000 హెక్టార్ల వరి భూమిపై జరిగిన అధ్యయనం. కాబట్టి ఇదే ఫలితాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తప్పనిసరిగా వస్తాయని చెప్పలేం. అయితే తెలంగాణలోని వరి ప్రాంతాల్లో నేల సారంలో స్థానికంగా గణనీయమైన తేడాలు ఉన్నాయని, వాటిని శాస్త్రీయంగా మ్యాప్‌ చేసి ఎరువుల మోతాదును నిర్ణయిస్తే ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే అవకాశం ఉందని పరిశోధన సూచిస్తోంది. అలాగే ‘ప్రిసిషన్‌’వ్యవసాయం అంటే కేవలం జీపీఎస్‌ పరికరం ఒక్కటే సరిపోదు. మట్టి నమూనాల సేకరణ, జీపీఎస్‌ స్థాన నిర్ధారణ, భౌగోళిక మ్యాపింగ్, పోషకాల విశ్లేషణ, పంటకు అనుగుణంగా ఎరువుల సిఫార్సులు వంటి మొత్తం వ్యవస్థ అవసరం. ప్రస్తుతం ఈ విధానం పరిశోధన స్థాయిలో మంచి ఫలితాలను చూపుతోందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎరువు ఎక్కువైతేనే దిగుబడి ఎక్కువ అన్న పాత ఆలోచనకు బదులు.. నేల కోరినంతే ఎరువు అనే విధానం వైపు తెలంగాణ వ్యవసాయం అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన చాటుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement