చిలుకూరు గ్రామ జనాభా 8 వేలకు పైనే. 1,500కు పైగా నివాసాల నుంచి నిత్యం విడుదలయ్యే మురుగు నీటిని పైప్‌లైన్లు, మురుగు కాలువల ద్వారా అర కిలోమీటర్ దూరంలోని ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి వదులుతున్నారు.
కాలుష్య కాసారాలుగా మారుతున్న జంట జలాశయాలు
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చుట్టూ అక్రమ నిర్మాణాలు
జీవో 111 ఉల్లంఘనలు.. విల్లాలు, అపార్ట్‌మెంట్ల నుంచి మలినాలు నేరుగా రిజర్వాయర్లలోకి..
ఉస్మాన్‌సాగర్‌లోకి రోజుకు సగటున 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌లోకి 43 లక్షల లీటర్లకు పైగా వ్యర్థాలు
తాగునీరు విషంగా మారే ప్రమాదముందంటున్న నిపుణులు
నాలుగేళ్ల క్రితమే గణనీయంగా దిగజారిన నీటి నాణ్యత
హుస్సేన్‌సాగర్‌లా మారిపోతున్న రెండు రిజర్వాయర్లు!
సాక్షి, హైదరాబాద్: చారిత్రక జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) మరో హుస్సేన్‌సాగర్‌గా మారనున్నాయా? వందేళ్ల క్రితం హుస్సేన్‌సాగర్‌కు జరిగిందే మళ్లీ పునరావృతం కానుందా? గతంలో జంటనగరాల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న జలాశయాలు క్రమంగా కాలుష్య కాసారాలుగా మారుతున్నాయా? మూసీ, ఈసీ నదులపై నిర్మించిన రిజర్వాయర్లలోకి మురుగునీరు వరదలా వచ్చి చేరుతోందా?..ఈ ప్రశ్నలన్నిటికీ ‘అవును’అనే సమాధానమే లభిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌కు అవసరమైన తాగునీటికి ప్రధాన ఆధారంగా ఉన్న హుస్సేన్‌సాగర్ క్రమంగా మురుగు, పారిశ్రామిక వ్యర్థాలతో నిండిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జంట జలాశయాల పరిస్థితి కూడా అలాగే మారుతోంది. రిజర్వాయర్లకు సమీపంలో ఉండే గ్రామాల నుంచి వచ్చే మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలతో నిండిపోతున్నాయి. దీంతో ఎగువ నుంచి వచ్చి చేరే వరద నీరు కాస్తా విషతుల్యంగా మారిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరివాహక ప్రాంతాల్లో వేగవంతమైన పట్టణీకరణతో విల్లా ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు వెలసినా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో శుద్ధి చేయని మురుగు నీరు నేరుగా జలాశయాల్లోకి చేరుతోంది. మానవ వ్యర్థాలు కలిసిన మురుగు చేరుతుండటంతో జలాశయాల నీరు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి సంబంధించిన నీటి నాణ్యత సూచిక 2022కు ముందు ఆరేళ్లలోనే గణనీయంగా దిగజారిపోగా..తదుపరి 3–4 ఏళ్లలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదకర ఈ–కోలై బ్యాక్టీరియా, యూట్రోఫికేషన్
జంట జలాశయాల చుట్టూ ఉన్న ప్రాంతాలను ‘సాక్షి’క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ప్రతి గ్రామం నుంచి మురుగు నీటి పైప్‌లైన్లు జలాశయాల్లో కలవడం కనిపించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలే స్వయంగా పైప్‌లైన్లు వేసి మురుగు నీటిని నేరుగా జలాశయాల్లోకి వదులుతుండటం విస్మయానికి గురిచేసింది. ఉస్మాన్‌సాగర్‌కు రోజుకు సగటున 29 లక్షల లీటర్ల మురుగు వచ్చి చేరుతున్నట్టు అనధికార అంచనా కాగా..ఇక హిమాయత్‌సాగర్‌లో రోజుకు సగటున ఏకంగా 43.5 లక్షల లీటర్ల మురుగునీటి ప్రవాహం కలుస్తోంది. వర్షకాలంలో ఈ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుంది. మానవ వ్యర్థాలు కలవడంతో నీటిలో హానికారక ఈ–కోలై, ఫేకల్ కోలీఫాం (విసర్జిత) బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతోంది. మురుగు నీటిలోని నైట్రేట్లు, ఫాస్ఫేట్ల వల్ల జలాశయ ఉపరితలంపై గుర్రపు డెక్క విస్తరిస్తూ నీటిలో ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. ఆల్గే పెరుగుదల, హానికర ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడి జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇటీవల మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక రీసెర్చ్ స్కాలర్ నిర్వహించిన వివరణాత్మక అధ్యయనం ఈ ఆందోళనకర వాస్తవాలను వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియ¯న్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం ఈ రెండు జలాశయాల నీరు తాగడానికి ఏమాత్రం అనుకూలం కాదని నిర్ధారించింది. ఉస్మా¯న్‌సాగర్‌లో భారీ లోహాలు, ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, హిమాయత్‌సాగర్‌లో సమీప గ్రామాల నుంచి శుద్ధి చేయని మురుగు, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు వచ్చి కలుస్తూ తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది.
భూగర్భ జలాలు కూడా కలుషితం
జలాశయాల్లో పేరుకుపోతున్న రసాయన వ్యర్థాలు చుట్టుపక్కల గ్రామాల బావులు, బోరు బావులను కూడా కలుíÙతం చేస్తున్నాయి. భూగర్భ జలాలు తాగడానికి పనికిరాని విధంగా మారుతూ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ సరస్సుల్లో కాలుష్య కారకాలు, ఫ్లోరైడ్లు ఉండటం పౌరుల ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు పలుమార్లు ఈ కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి నాణ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఇరిగేషన్ శాఖ, వాటర్‌బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్‌ఎంసీల నుంచి వివరణ కోరడం గమనార్హం.
సహజ కాలువల ఆక్రమణ.. జీవో 111 ఉల్లంఘనలు
సహజ సిద్ధమైన వాన నీటి కాలువలు ఆక్రమణలకు గురికావడంతో వాటి స్థానంలో మురుగు ప్రవాహాలు ఏర్పడ్డాయి. జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో భారీ నిర్మాణాలను నిషేధించిన జీవో 111 అమలులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ వెంచర్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. పరిమిత అభివృద్ధికి అవకాశం ఇస్తూ కఠిన రక్షణ చర్యలు సూచించినా, ఇప్పటికే జరిగిన ఉల్లంఘనలు కాలుష్యాన్ని తీవ్రం చేశాయి.
ఎస్టీపీల ప్రణాళికలు కాగితాల్లోనే..
జంటజలాశయాలకు సంబంధించిన మురుగు శుద్ధి కోసం ఉద్దేవించిన నాలుగు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్‌టీపీలు) నిర్మాణం ఆలస్యమవడం మరింత కాలుష్యానికి కారణమవుతోంది. ఇవి పూర్తయితే కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నా జాప్యం కొనసాగుతోంది. వాటర్‌బోర్డు రింగ్ మైక్రో–సీవరేజ్ నెట్‌వర్క్ ప్రణాళిక రూపొందించినా అమలు మందగతిలోనే సాగుతోంది. ప్రతి ప్రధాన గ్రామం, లేఅవుట్ వద్ద వికేంద్రీకత మురుగు శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే తప్ప పరిస్థితి కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రామం మురుగునీరు మొత్తం జలాశయంలోకే..
గ్రామ మురుగు నీరు మొత్తం గండిపేట జలాశయంలోకి చేరుతోంది. పైప్‌లైన్ వేసి మరీ వదులుతున్నారు. వర్షకాలంలో మరింత ఎక్కువగా మురుగు నీరు పారుతోంది. గ్రామానికి మంచినీటి అవసరాల కోసం మిషన్ భగరిథతో పాటు జలాశయంలోని బోరు ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే చూస్తూ చూస్తూ తాగలేం కాబట్టి ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నాం.
– జంగా శంకర్, చిలుకూరు


