16న కొత్త చేయూత పింఛన్లు షురూ! | New pensions start on the 16th August | Sakshi
Sakshi News home page

16న కొత్త చేయూత పింఛన్లు షురూ!

Aug 9 2026 4:34 AM | Updated on Aug 9 2026 4:34 AM

New pensions start on the 16th August

లాంఛనంగా ములుగులో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

చేయూత పోర్టల్‌లో అందుబాటులోకి దరఖాస్తు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త చేయూత పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించే అవకాశా లున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ములుగులో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల పనులకు సీఎం భూమి పూజ నిర్వహించి అక్కడే నిర్వహించే బహిరంగ సభలో కొత్త పింఛన్లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే తొలుత తలసేమియా, సికిల్‌సెల్, ఇతర కేటగిరీలకు పరిమితంగానే పింఛన్లు ఇస్తారని తెలిసింది. 

శుక్రవారం రాత్రి నుంచే చేయూత వెబ్‌పోర్టల్‌లో అన్ని కేటగిరీలకు సంబంధించి కామన్‌ దరఖాస్తును ప్రజలు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చింది. శుక్ర, శనివారాల్లో సెర్ప్, మెప్మా అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్‌డీవో), జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశాల్లో పలు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. 

ఆన్‌లైన్‌లోనే స్వీకరణ
ప్రభుత్వం రెండున్నర లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని సూత్రప్రా యంగా నిర్ణయించినా... తొలివిడతగా 50 వేల పింఛన్లు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా రెండు వారాలపాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మీసేవా కేంద్రాలతోపాటు ఆన్‌లైన్‌లో సమర్పణకు వీలుగా ఎంపీడీవో ఆఫీసుల్లో, మండల సమాఖ్యలు, మున్సిపల్‌ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ కేటగిరీల దరఖాస్తుల సమర్పణ పూర్తయ్యాక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం సమగ్ర వేదిక డేటాబేస్‌ ద్వారా 360 డిగ్రీల్లో వాటిని రెండు వారాలపాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. 

తర్వాత ‘చేయూత’ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ దరఖాస్తుదారు అర్హులో కాదో పరిశీలించి ఖరారుచేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తహసీ ల్దార్లు సంబంధిత డీఆర్‌డీవో, డీఆర్‌వోకి పంపుతారు. తదనంతరం ఈ జాబితాను జిల్లా కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వీటి ఆమోదానికి వారం, పదిరోజులు పడుతుంది. అంటే మొత్తం ప్రక్రియకు నెలన్నర రోజులు దాకా పట్టే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.  

ట్యాంపర్‌ ప్రూఫ్‌గా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు
నకిలీలకు చెక్‌ పెట్టేలా లామినేటెడ్‌ కార్డుల తయారీ
ఈ నెల 15 నుంచి 1.05 కోట్ల కార్డుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతోపాటు రేషన్‌ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సిద్ధం చేసింది. కార్డుల్లోని వివరాలను మార్చడానికి ఏమాత్రం వీల్లేని విధంగా సురక్షితమైన లామినేటెడ్‌ కార్డులను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఈ నెల 15న ప్రారంభించనుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లోనూ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

1.05 కోట్ల కుటుంబాలకు..
ప్రభుత్వం కొత్తగా 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసింది. దీంతో అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు. కొత్త కార్డుల మంజూరుతో రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. వాటి ద్వారా 3.42 కోట్ల మంది ఆహార భద్రత పొందుతున్నారు. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఖరారు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కుటుంబ పెద్దగా ఇంటి ఇల్లాలు ఫొటోతో కార్డు రానుంది. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రేషన్‌కార్డులకు కుటుంబ పెద్ద ఫొటోను ‘ఆధార్‌’ ఆధారంగానే తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల అధికారి ఒకరు తెలిపారు. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement