దేశంలో 4.54 లక్షల సామర్థ్యం.. 5.12 లక్షల మంది ఖైదీలు
609 జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు
తెలంగాణలో మాత్రం 84.6 శాతం ఆక్యుపెన్సీ
జైళ్లసామర్థ్యం, ఖైదీల సంఖ్యపై కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక
ఉమ్మడి వరంగల్ జైళ్లు ఫుల్... సెంట్రల్ జైలు ఎత్తివేత ప్రభావం
సాక్షిప్రతినిధి, వరంగల్: ఖైదీలతో జైళ్లు దేశవ్యాప్తంగా కిక్కిరిసిపోతున్నాయి. 4.54 లక్షల మంది ఖైదీలకు సరిపడే జైళ్లలో ఏకంగా 5.12 లక్షల మంది ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2024, డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్ల మొత్తం అందుబాటులో ఉన్న సామర్థ్యం 4,53,769 కాగా.. వాస్తవంగా 5,11,542 మంది ఖైదీలు ఉన్నారు. అంటే జైళ్ల సామర్థ్యానికి మించి 57,773 మంది అదనంగా ఉన్నారు. మొత్తం ఆక్యుపెన్సీ 112.7 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా 609 జైళ్లు నిర్దేశిత సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024 ఆధారంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి రాజ్యసభలో ఈ గణాంకాలను ఈ నెల 5న వెల్లడించారు.
ఏటా పెరుగుతున్న ఖైదీలు
నేరాలు, నేరస్థుల సంఖ్య పెరుగుతుండటంతో జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి సీరియస్‌గా ఉంది. మధ్యప్రదేశ్ జైళ్ల సామర్థ్యం 30,644లకు గాను 45,092 మంది ఖైదీలున్నారు. ఇది అక్కడి జైళ్ల సామర్థ్యం కంటే 14,448 (147.1 శాతం) అధికం. అలాగే మహారాష్ట్రంలో 27,110లకు 39,003 మంది కాగా 11,893 (143.9 శాతం) అదనంగా ఖైదీలు జైళ్లల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 76,162లకు 86,762 (113.9 శాతం), ఛత్తీస్‌గఢ్‌లో 14,733లకు 18,798 (127.6 శాతం), గుజరాత్‌లో 14,108లకు 17,766 (125.9 శాతం) ఉన్నారు. ఇలా దేశ వ్యాప్తంగా 609 జైళ్లలో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.
తెలంగాణలో భిన్న పరిస్థితి..
దేశవ్యాప్తంగా జైళ్లు ఓవర్‌లోడ్‌తో సతమతమవుతుండగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని జైళ్ల అందుబాటులో ఉన్న సామర్థ్యం 8,013 మంది కాగా.. 2024 డిసెంబర్ 31 నాటికి 6,782 మంది ఖైదీలు ఉన్నారు. అంటే ఆక్యుపెన్సీ 84.6 శాతం మాత్రమే. సామర్థ్యంతో పోలిస్తే 1,231 మంది మేర స్థలం అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా 2020లో రాష్ట్ర జైళ్ల సామర్థ్యం 7,845 కాగా 6,114 మంది ఖైదీలు ఉన్నారు. 2021లో సామర్థ్యం 7,997కి పెరగగా ఖైదీల సంఖ్య 7,316కు చేరింది. అదే ఏడాది ఆక్యుపెన్సీ 91.5 శాతానికి చేరుకుంది. 2022లో 6,497 మంది, 2023లో 5,853 మంది ఖైదీలు ఉండగా.. 2024లో ఈ సంఖ్య మళ్లీ పెరిగి 6,782కు చేరింది.

ఉమ్మడి వరంగల్‌లో నాలుగు జైళ్లు...
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, పరకాల, మహబూబాబాద్, నర్సంపేట జైళ్లు వరంగల్ జిల్లా సబ్ జైళ్ల అధికారి పరిధిలో ఉన్నాయి. మొత్తం ఈ జైళ్లలో ఖైదీల సామర్థ్యం 220 మంది. 2021 జూన్ 14న 680 నుంచి 1000 మంది ఖైదీలుండే వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. ఆ జైలు ప్రత్యామ్నాయంగా మామునూరు 4వ బెటాలియన్ ప్రాంతంలో వంద ఎకరాల్లో చేపడుతామన్న సెంట్రల్ జైలు నిర్మాణానికి ఇప్పటికీ మోక్షం లేదు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ సెంట్రల్ జైలును ఆగమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వం మారగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్మాణంలో ఆ చొరవ చూపడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసుల్లో నిందితులను ఈ నాలుగు జైళ్లకే పంపడం అనివార్యం అవుతోంది. వరంగల్ సెంట్రల్ జైలు ఎత్తివేత ప్రభావం మిగతా జైళ్లపై పడుతోందన్న చర్చ జరుగుతోంది.


