మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పరిధిలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి వచ్చిన వేలాది మంది నిరుద్యోగులను ప్రభుత్వం అవమానించిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని దుర్భాషలాడుతూ వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ యువత, నిరుద్యోగులకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’అని దూషించిన సీఎం బాటలోనే అధికారులు కూడా నిరుద్యోగులను దూషిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. 32 నెలలు దాటినా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు బోగస్ హామీలు ఇచ్చిన ప్రభుత్వ తీరుపై యువతలో నిరాశ పెరుగుతోందని తెలిపారు. ఉన్నత విద్య చదివిన వారు కూడా చిరుద్యోగాల కోసం పోటీ పడాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న పార్టీ నేతలను హరీశ్‌రావు శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేశ్‌ను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి మహమూద్ అలీ తదితరులు ఉన్నారు.


