రేపటితో సర్ ఎన్యూమరేషన్ ఫారాల గడువు ముగింపు
3.38 కోట్ల మంది ఓటర్లలో ఫారాలు ఇచ్చింది 2.64 కోట్ల మందే..
ఫారాలు తిరిగి ఇవ్వనివారు 5,07,908 మంది
బీఎల్‌వోల దగ్గరే ఉండిపోయిన ఫారాలు 69 లక్షలు
వీరంతా గైర్హాజరు, వలస, డూప్లికేట్, డెడ్ ఓటర్లుగా నిర్ధారణ
వీరి పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో వరుసగా 36%, 35%, 32% ఓట్ల తొలగింపు!
57,01,678 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు.. వీరందరికీ త్వరలో నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ)కు సమర్పించడానికి గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు గడువు పెంచగా, మరోసారి పెంచే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, క్షేత్రస్థాయిలో 2,69,19,026 మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నారు. అందులో ఇప్పటివరకు 2,64,11,118 మంది (78.08%) తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించడంతో వాటి డిజిటలైజేషన్ సైతం పూర్తయింది. ఫారాలు తీసుకున్న ఓటర్లలో మరో 5,07,908 మంది (1.5%) ఓటర్లు ఇంకా వాటిని బీఎల్‌ఓలకు తిరిగి సమర్పించలేదు. వాటిలో అధిక శాతం ఫారాలు తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి, రెండు చోట్లా ఫారాలు తీసుకున్న ఓటర్లు ఒకేచోట వాటిని సమర్పిస్తున్నారు.
మరో చోటుకు సంబంధించిన ఫారాన్ని తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఇక 69,07,422 మంది ఓటర్ల (20.42శాతం) నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేమని ఎన్నికల యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి వీరందరూ గైర్హాజరులో ఉండటం/అందుబాటులో లేకపోవడం, వలసవెళ్లడం, డూప్లికేట్ ఓటు కలిగి ఉండటం, మరణించడం(ఏఎస్‌డీడీ) వంటి కారణాలతో తమ ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోలేకపోయారు. దీంతో ఈ నెల 17న ప్రచురించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరి పేర్లు తొలగించనున్నారు. ఫారాలు తీసుకుని సమర్పించని 5 లక్షల మంది ఓటర్లను సైతం పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 70–75 లక్షల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3 లక్షల నకిలీ ఓటర్లు
మరో 3,13,399 (0.93శాతం) మంది ఓటర్లు డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ (డీఎస్‌ఈ) కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, వయసు పోలికలతో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో డూప్లికేట్ ఓటును వీరు కలిగి ఉన్నట్టు ‘ఈఆర్వోనెట్’ సాఫ్ట్‌వేర్ గుర్తించింది. అంటే, వీరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఎన్యూమరేషన్ ఫారం సమర్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుబాటులో లేకపోవడం, వలసవెళ్లడం, డూప్లికేట్ ఓటు కలిగి ఉండటం(ఏఎస్‌డీ) అనే అంశాల ఆధారంగా మరో 2,80,434 మంది (0.83శాతం) ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు (అనామలీస్) గుర్తించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంది.
69 లక్షల మందికి నోటీసులు
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినప్పటి నుంచి అక్టోబర్ 15 వరకు వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 69,07,422 మంది (20.42శాతం) ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ గుర్తించింది. వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంది. విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 6,66,333 మంది, రంగారెడ్డి జిల్లాలో 5,57,395 మంది, నిజామాబాద్ జిల్లాలో 3,95,215 మంది, సంగారెడ్డి జిల్లాలో 3,47,575 మంది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 3,25,223 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. శాతాల వారీగా చూస్తే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 28.59 శాతం, వనపర్తి జిల్లాలో 27.93శాతం, నిజామాబాద్ జిల్లాలో 27.45శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 26.89శాతం, నారాయణపేట జిల్లాలో 26.48శాతం, నిర్మల్ జిల్లాలో 26.17శాతం మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి.
పట్నం వద్దని పల్లెకే ఓటు
రాష్ట్రంలో చాలామంది ఓటర్లు హైదరాబాద్‌తోపాటు వారి సొంత గ్రామాల్లో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఒకేచోట ఎన్యూమరేషన్ ఫారం వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో చాలామంది ఓటర్లు పట్నంలో కాదని పల్లెలోనే తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించారు. పల్లెల్లో వ్యవసాయ భూములు, ఆస్తులుండటంతోపాటు స్థానిక రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉండటంతో చాలామంది అక్కడే ఓటు హక్కు కలిగి ఉండడానికి ఇష్టపడ్డారని అధికారవర్గాలు తెలిపాయి. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని ఇవ్వని ఓటర్లను మిగిలిన రెండు రోజుల్లో కలిసి వారి నుంచి ఫారాలు తీసుకునేందుకు ప్రయతి్నంచాలని బీఎల్‌ఓలను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
హైదరాబాద్‌లో ఇవ్వని వారు 36.7%
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లుండగా, రాష్ట్రంలోనే అతి తక్కువ శాతం (58.41%) ఓటర్లే ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. 17,38,281 మంది (36.7%) ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి సేకరించలేమని నిర్ధారించా రు. అలాగే, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 29,79,130 మంది ఓటర్లుండగా, 10,48,353 మంది (35.19%) మంది ఫారాలు, రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లుండగా, 1,21,7056 మంది(32.09%) ఫారాలు, హనుమ కొండ జిల్లాలో 5,09014 మంది ఓటర్లుండగా 99,413 (19.53%) మంది ఫారాలు, వికారాబాద్ జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా, 1,97,789 మంది (19.44%) ఫారాలను సేకరించలేమని ఎన్నికల యంత్రాంగం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంత జిల్లాల్లో 9–17% వరకు ఫారాలు సేకరించలేమని గుర్తించారు.


