హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ప్రభుత్వం బాద్యతలు నిర్వహించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదని విమర్శించారు.
మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో మా హరీష్‌రావు జీఆర్‌ఎంబీ ఎజెండాపై ప్రశ్నించారు. కన్నేపల్లికి నేను వెళ్లి లక్ష క్యూసెక్కులు పోతున్నాయని చెప్పా. క్షద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షద్ర రాజకీయాలు చేస్తున్నారు. కరెంట్ ఉండి నేడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కరెంట్ సరఫరా సరిగా ఉండటం లేదు. యాగాలు చేస్తే తప్పు లేదు... కేసీఆర్ యాగాలు చేశారు’ అని పేర్కొన్నారు.
త్వరలో అన్ని ఆధారాలతో వివరాలు బయటపెడతా
రంగారెడ్డి జిల్లాలో భారీ భూకుంభకోణం జరుగుతోంది. త్వరలో ఆధారాలతో సహా వివరాలు బయటపెడతా. రైతులు, కంపెనీ మధ్య సీఎం, పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఎకరానికి రూ. 10 కోట్లు వరకూ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. కానీ ఎకరానికి రూ. 5 కోట్ల లోపే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో సర్వే నంబర్లతో సహా అన్ని బయటపెడతా’ అని హెచ్చరించారు.


