సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఇటీవల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందగా.. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
తద్వారా మొత్తంగా 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలవాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు.


