తెలంగాణ కీర్తిని నింగికెత్తిన అనూహ్య.. విక్రమ్‌–1లో కీలక పాత్ర | Basara RGUKT Alumna Anuhya Plays Key Role in Vikram-1 Space Mission | Sakshi
Sakshi News home page

తెలంగాణ కీర్తిని నింగికెత్తిన అనూహ్య.. విక్రమ్‌–1లో కీలక పాత్ర

Aug 8 2026 11:41 AM | Updated on Aug 8 2026 11:56 AM

Basara student Anuhya plays key role in Vikram1 space mission

నిర్మల్‌: దేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ ‘విక్రమ్‌–1’ (మిషన్‌ ఆగమనం) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చారిత్రాత్మక సందర్భంలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) బాసర పూర్వ విద్యార్థిని అలుగోజు అనూహ్య ప్రత్యేక ప్రతిభ కనబర్చి వర్సిటీ కీర్తిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఆమె సాధన విశ్వవిద్యాలయంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది. ప్రముఖ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థలో సాంకేతిక విభాగం ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనూహ్య ఈ ప్రతిష్టాత్మక మిషన్‌కు అవసరమైన కీలక సాంకేతిక అనుసంధాన వ్యవస్థల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు.

కష్టాలను అధిగవిుంచి..
కరీంనగర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనూ హ్య 2018–2024 మధ్యకాలంలో ఆర్జీయూకేటీ బాసరలో బీటెక్‌ పూర్తి చేశారు. సాధారణ వ్యవసా య కుటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రయాణం అనేకమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తల్లి అలుగోజు లతాశ్రీ వ్యవసాయంలు చేస్తూ ఎన్నో కష్టనష్టాలను భరించి పిల్లలకు ఉన్నత విద్యను అందించారు. తల్లి  ప్రోత్సాహమే అనూహ్యను దేశం గర్వించే స్థాయికి చేర్చాయి.

ఇదే వర్సిటీలో సోదరుడు..
ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన ఆమె సోదరుడు అలుగోజు ఆదిత్య(బి171255) సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌ (ఎస్‌టీఈఎం)తోపాటు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల్లో శిక్షణ ఇస్తూ భవిష్యత్‌ తరం విద్యార్థులను శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకే ఇంట్లో తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఇద్దరు సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించడం విశేషం.

వర్సిటీ యంత్రాంగం అభినందనలు
ఆర్జీయూకేటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌ అనూహ్య సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నతికి ప్రాధాన్యం ఇస్తూ వారిని అంతర్జాతీయ స్థాయి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడమే మా విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యం. అనూహ్య సాధించిన ఈ అసాధారణ విజయం వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుంది. సాంకేతిక విద్యను నూతన శిఖరాలకు తీసుకెళ్తూ భవిష్యత్‌ దేశ నిర్మాతలైన విద్యార్థులను తయారు చేయడానికి వర్సిటీ అహర్నిశలు శ్రమిస్తోంది’’ అని వివరించారు. ఓఎస్‌డీ ఇ. మురళీదర్శన్, అసోసియేట్‌ డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు అలుగోజు అనూహ్యకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement