నా భర్తను చంపేయ్‌... ఆ తర్వాతే కనిపించు | WhatsApp Messages Between Woman and Alleged Lover Spark Shock in Telangana | Sakshi
Sakshi News home page

నా భర్తను చంపేయ్‌... ఆ తర్వాతే కనిపించు

Aug 8 2026 5:51 AM | Updated on Aug 8 2026 5:51 AM

WhatsApp Messages Between Woman and Alleged Lover Spark Shock in Telangana

ప్రియుడిని ఉసిగొల్పిన వివాహిత 

ఆధారాలతో భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు 

ఖమ్మం రూరల్‌: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చాలని చూసింది ఓ భార్య. ఈ విషయాన్ని గ్రహించిన భర్త పోలీసులను ఆశ్రయించగా, భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలోని అద్దె ఇంట్లో ఉంటూ ఖమ్మంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో రాజేశ్వరరావు పని చేస్తున్నాడు.

రెండు నెలల క్రితం సాయిప్రభాత్‌నగర్‌లోని అద్దె ఇంటికి మారారు. అయితే భవాని ప్రవర్తనలో మార్పు వచి్చంది. రాజేశ్వరరావుకు దూరంగా ఉంటూ పిల్లలను సరిగా చూసుకోవడంలేదు. జూలై 27న ఆస్పత్రి నుంచి రాజేశ్వరరావు మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా, ఆమె మరో వ్యక్తితో చనువుగా కనిపించింది. దీంతో రాజేశ్వరరావు అరవడంతో ఆమె తలుపు తీయగానే సదరు వ్యక్తి పారిపోయాడు. ఎవరని అడిగితే తనకు తెలియదంటూ భర్తతో గొడవకు దిగింది.

ఈ విషయాన్ని ఆయన తన బంధువులకు చెప్పగా చిలుకోడులో పంచాయతీ పెడతామని చెప్పారు. ఈనెల 28న ఇద్దరు పిల్లలను చిలుకోడులో దిగబెట్టాక, పెరుమాండ్ల సంకీసలో ఉన్న సోదరుడిని తీసుకొచ్చేందుకు బైక్‌పై బయలుదేరాడు. అయితే, ఓ వ్యక్తి తనను అనుసరిస్తుండడంతో పరిశీలించగా తన భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా గుర్తించి నిలదీస్తుండగా పారిపోయాడు.  

చంపేయ్‌ అంటూ చాటింగ్‌  
అక్కడి నుంచి చిలుకోడు వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య భవాని సెల్‌ఫోన్‌లో ఇన్‌స్ట్రాగాం, వాట్సాప్‌ పరిశీలించగా ‘నా భర్తకు వేరే వ్యక్తితో యాక్సిడెంట్‌ చేయించాకే కనిపించు. వాడు మళ్లీ బతకకూడదు, వేరే వ్యక్తి అయితేనే మనపై అనుమానం రాదు’అంటూ పంపించిన మెసేజ్‌లు ఉన్నాయి. అవి ఎవరికి పంపిందోనని నంబర్‌ పరిశీలిస్తే ఖమ్మంలో కొరియర్‌ బాయ్‌గా పని చేసే పురిమెట్ల సైదులుగా తేలింది. ఆయనది కూడా భవాని స్వగ్రామమైన రాఘవాపురం అని తెలిసింది. ఈమేరకు తొలుత రాజేశ్వరరావు డోర్నకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఖమ్మం రూరల్‌ స్టేషన్‌కు బదలాయించారు. మరోమారు ఖమ్మం రూరల్‌లో కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం భవాని, సైదులుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement