నితిన్‌నబిన్‌ను సత్కరిస్తున్న బండి సంజయ్. చిత్రంలో రాంచందర్‌రావు, చంద్రశేఖర తివారీ, అభయ్ పాటిట్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రఘునందన్, నగేశ్
మొత్తం కంట్రోల్‌లోకి తీసుకుంటాం... – కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిందే
మీ జిల్లాల పరిధిలో ఇతర పార్టీల నేతల చేరికలపై దృష్టి పెట్టాలి
ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక భేటీ
తెలంగాణలో జనసేనతో సహా ఏ పార్టీతో పొత్తు ఉండదు: మీడియాతో బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ‘తెలంగాణలో పార్టీని అన్ని విధాలా ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యేలా మీరు నడుం బిగిస్తారా? లేక మొత్తం మేమే కంట్రోల్‌లోకి తీసుకొని నడిపించాలా ? దీనిపై త్వరగా తేల్చుకొని స్పష్టమైన రోడ్‌మ్యా ప్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. లేనిపక్షంలో మా పద్ధతిలో పార్టీని ముందుకు నడిపిస్తాం’అని తెలంగాణ ముఖ్య నేతలకు బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాల్సిందేనని, అందుకు అవసరమైన అన్నిరకాల కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్టు తెలిసింది.
మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీఆర్‌ఎస్ నేతలను చేర్చుకునేందుకు వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎంపీలు ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించకపోయినా, వెంటనే జాతీయ నాయకత్వం ఎంటరై తమ ప్రతినిధుల ద్వారా చేరికల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తుందని హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు బుధవారం నుంచి నాలుగు రోజులుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో వరుస సమావేశాలు జరిగాయి.
3 నెలలకు ఓసారి వస్తా...పరిస్థితి సమీక్షిస్తా
ప్రతీ మూడునెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటి..వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర పార్టీ నేతల వ్యూహాలు, చేస్తున్న కృషిని సమీక్షిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బంyì సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, అరి్వంద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగేశ్‌లతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలు, ముఖ్య నేతల మధ్య నెలకొన్న వాతావరణం, సమన్వయం, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై అభయ్‌పాటిల్ జాతీయపార్టీకి సవివరమైన నివేదిక సమరి్పంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మరో నివేదికను అందజేసినట్టు సమాచారం.
డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా : బండి సంజయ్
రాష్టంలో పార్టీ కార్యకర్తల సమష్టి కృషితో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. నితిన్ నబీన్‌తో సమావేశం అనంతరం ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘ఎవరితోనూ పొత్తు లేదు’
తెలంగాణలో జనసేన పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార సాధనే లక్ష్యంగా పార్టీ ముందు కెళుతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్ మ్యాప్ అని నితిన్ నబీన్ స్పష్టం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని వెల్లడించారు. సెపె్టంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.


