యాగ క్రతువుపై సర్వత్రా ఆసక్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న మహావరుణ యాగంపై రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాలతోపాటు రైతుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సనాతన హిందూ ధర్మంలో యజ్ఞయాగాదులకు అత్యున్నత స్థానం ఉండగా, వేదకాలం నుంచి వరుణ దేవుడి ఆరాధన ఉంది. ఋగ్వేదం ప్రకారం వరుణుడు కేవలం వర్షానికే కాకుండా రుతం (విశ్వ నియమం), సృష్టి సమతుల్యతను కాపాడే సర్వోన్నత చక్రవర్తిగా వర్ణించారు.
యాగంలో భాగంగా 108 మంది రుత్వికులు ఏకధాటిగా చేసే వేదమంత్రాల ఉచ్ఛారణ ఒక గొప్ప తపస్సే. వర్ష పాశుపత మంత్రాలు, ’కరీరీ ఇష్టి’వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మన ఇతిహాసాల ప్రకారం కరువు వచి్చనప్పుడల్లా రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. కృత్రిమ వర్షాల కోసం చేసే ‘క్లౌడ్ సీడింగ్’(కెమికల్స్ చల్లడం) ప్రక్రియకు, మన వేదాల్లోని ’కరీరీ ఇష్టి’విధానానికి దగ్గరి పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం మేరకు..
కరీరీ ఇష్టి అంటే వర్షాన్ని రప్పించే అద్భుత క్రతువు. కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణీ సంహిత ఆధారంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వర్షాల కోసం చేసే అత్యంత శక్తివంతమైన వైదిక యాగమే ఈ ’కరీరీ ఇష్టి’.
కృష్ణ వర్ణ సిద్ధాంతం: ఈ క్రతువులో ఉపయోగించే ప్రతి వస్తువు నలుపు రంగులో (కృష్ణ వర్ణం) ఉంటుంది.. ఋత్వికులు ధరించే వస్త్రాలు, హోమ ద్రవ్యాలు, చివరికి అగ్నికి సమర్పించే వెదురు, బియ్యంతో చేసిన అన్నం కూడా నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలను ఆకర్షించడానికి ఇవి దోహద పడతాయని భావిస్తారు.
కరీర ఫల ఆహుతి: ’కరీర’అనే ఒక ప్రత్యేకమైన అడవి పొద పండ్లను ఎండబెట్టి, వాటిని హోమ గుండంలో ప్రత్యేక మంత్రాలతో ఆహుతి ఇస్తారు. దీని వల్ల వాతావరణంలో తక్కువ పీడనం ఏర్పడి, మేఘాలు త్వరగా వర్షిస్తాయని నమ్ముతారు.
వర్ష పాశుపత హోమం
శివుని అత్యంత ఉగ్ర రూపమైన ’పాశుపత’తత్వాన్ని ప్రకృతి అనుకూలతకు మళ్లించే ప్రక్రియే ఈ హోమం. జల స్వరూప శివారాధన ద్వారా అభిషేక ప్రియుడు. లయకారుడైన పరమశివుడిని శాంతింపజేసి, ప్రకృతిలో సమతుల్యతను తీసుకురావడానికి రుత్వికులు ’పాశుపతాస్త్ర మంత్రాలు’జపిస్తూ ఈ హోమం చేస్తారు.
పర్జన్య శాంతి
వేదాల ప్రకారం వర్షాన్నిచ్చే మేఘ రూప దేవతను ’పర్జన్యుడు’అంటారు. ’పర్జన్య సూక్తం’పఠిస్తూ హోమం చేయడం ద్వారా ఆకాశంలో మేఘ గర్జనలు మొదలై, పిడుగుల వంటి నష్టం కలగకుండా శాంతమైన, మేలు చేసే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు విశిష్ట ప్రక్రియల ద్వారా గాలిలోని తేమ శాతం పెరిగి, స్థానిక వాతావరణం చల్లబడి, ఆ పరిసర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆశిస్తారు.
ఉపయోగించే మూలికలు
వరుణ వృక్ష మూలిక: ఇదే ఈ యాగంలో ప్రధాన ద్రవ్యం. వరుణ బెరడును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని మూత్ర, కిడ్నీ సంబంధ వ్యాధుల నివారణిగా వాడుతారు. యాగంలో ఈ వృక్షం ఎండిన కొమ్మలు, బెరడును హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు.
కృష్ణ తిలాలు: ఈ యాగంలో నలుపు రంగు ద్రవ్యాలకు ప్రాధాన్యం. నల్ల నువ్వులతో హోమం చేయడం ద్వారా వాతావరణంలో దట్టమైన సానుకూల ధూమం (పొగ) ఏర్పడి మేఘాలను ఆకర్షించడానికి తోడ్పడుతుందని నమ్ముతారు.
సుగంధి వేళ్లు (వట్టివేరు): వాతావరణాన్ని చల్లబరచడానికి, వర్షపు మేఘాలకు అవసరమైన తేమను ప్రసాదించడానికి వట్టివేరును ఆహుతిగా ఇస్తారు.
యాగ సమిధిలు: యాగశాలలో 11 హోమకుండాల్లోప్రత్యేకమైన నవగ్రహ, యాగ సమిధలను ఉపయోగిస్తారు. అందులో మర్రి, జువ్వి, రావి, మేడి, ఉత్తరేణి, జమ్మి తదితర పంచక్షీర వృక్షాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి ఉపయోగిస్తారు.


