నల్లగొండ టూటౌన్ : మారుతున్న విద్యారంగానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం నేర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వారం రోజులు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి, బోధనా ప్రక్రియలో సాంకేతికతను అనుసందానం చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని కోరారు. విద్యారంగంలో వేగంగా వస్తున్న మార్పులను గమనించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రశాంతి, ఢిల్లీ నుంచి ఫ్రొఫెసర్ శంకర్, ప్రొఫెసర్ అమిత్, డాక్టర్ ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ సెక్రటరీగా శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీగా మిర్యాలగూడ బకల్‌వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నామి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి పి.సుశీందర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి విమల పదవికాలం ముగియడంతో శ్రీనివాస్‌రెడ్డిని నియమించామని, ఈయన నియామకం రెండు సంవత్సరాలు పాటు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
యూడీసీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
రామగిరి(నల్లగొండ): యునైటెడ్ దళిత క్రిస్టియన్స్ ఫెడరేషన్ (యూడీసీఎఫ్) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమ్యూనిటీ హాల్‌లో ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా డిఐ.సామ్‌సన్, ఉపాధ్యక్షుడిగా జేపీ సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా పి.డేవిడ్‌రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.ఎబినేజర్, సలహాదారుగా పి.జేమ్స్, కోశాధికారిగా ఆదిమల్ల ప్రభుదాసును, పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
మిర్యాలగూడ : ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటినే అమలు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రాజెక్టులను పట్టించుకోకుండా అంతర్గత గొడవలతో సమయం వృథా చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈనెల 10న చేపట్టే జైల్ భరోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి,
డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, వరలక్ష్మి, మల్లు గౌతంరెడ్డి, పాండు, ఎర్రనాయక్, సైదులు, అరుణ, నాగమణి, గోవర్ధన, సైదమ్మ ఉన్నారు.


