నల్లగొండ టూటౌన్ : స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రాముఖ్యత సంతరించుకున్న చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి హైదరాబాద్ రోడ్డులోని రాఘవేంద్ర కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమానికి ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని, ఆ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేలా ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ గోవిందయ్య, కర్నాటి వెంకటేశం, దుడుకు లక్ష్మీనారాయణ, గంజి మురళి, దత్తగణేష్, పి.సత్యనారాయణ, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


