హైదరాబాద్: నగరంలో ఆదిక్‌మెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సిలిండర్ పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా భయాందోళన పరిస్థితి నెలకొంది. ఆదిక్‌మెట్ పరిధిలోని వడ్డర బస్తీ, ప్రభుత్వ పాఠశాల సమీపంలో రాత్రి సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో సునీత, పుష్పలత అనే ఇద్దరు మహిళలు గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోగల సౌమ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే సిలిండర్ పేలడానికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


