హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలనిరాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత వర్గాలతో కూడిన జిల్లా నీటిపారుదల సలహా మండళ్లు ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్‌లో తప్పనిసరిగా సమావేశమై జలాశయాల నీటి నిల్వలు, ఆశించదగిన నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లోని సాగు పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైన జిల్లాల్లో రేపటి నుంచే నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మండళ్లు కేవలం నీటి విడుదలలపై నిర్ణయాలు తీసుకునే వేదికలు మాత్రమే కాకుండా రైతులు ఏ పంట వేస్తే భవిష్యత్తులో నష్టపోకుండా ఉంటారో ముందుగానే తెలియజేసే బాధ్యతాయుతమైన వ్యవస్థగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జలాశయాల నీటి నిల్వలు, రుతుపవనాల మిగిలిన కాలంలో వర్షపాతం అంచనాలను పరిశీలిస్తే అత్యంత జాగ్రత్తతో పంటల ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను సాగు చేయవద్దని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ వర్షాలను ఆధారంగా చేసుకుని రైతులు వరి సాగుకు వెళ్లడం సముచితం కాదన్నారు. ఒకసారి తడిపే అవకాశం లభించినా, రెండోసారి నీరు అందించే పరిస్థితి అనిశ్చితంగా మారే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రోత్సహించి రైతులను పంట వేయించి రెండు మూడు నెలల తర్వాత ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రతి కమాండ్ ఏరియాలో ఎంత మేరకు సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులు ఉన్నాయో కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు అధికారికంగా తెలియజేయాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల ప్రస్తుత పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని పేర్కొంటూ, ఆయా కమాండ్ ఏరియాల్లో నేల స్వభావం, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు.
వచ్చే వేసవిలో రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయరాదని హెచ్చరిస్తూ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్, నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబుతో సమన్వయం చేసుకుని భవిష్యత్తు తాగునీటి అవసరాలకు తప్పనిసరిగా ఎంత నీటిని నిల్వ ఉంచాలనే అంశాన్ని నిర్ణయించాలని ఆదేశించారు.
అదే వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల అనంతరం అర్హులైన కొత్త లబ్ధిదారులను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. ఈ క్రమంలో సుమారు 61 లక్షల మంది కొత్త లబ్ధిదారులను చేర్చి దాదాపు 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ సేవలు అందుతున్నాయని, ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం స్థానంలో ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.


