‘బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ | BRS Allegations on Irrigation Projects Are Baseless: Minister Jupally Krishna Rao | Sakshi
Sakshi News home page

‘బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’

Aug 7 2026 10:40 PM | Updated on Aug 7 2026 10:40 PM

BRS Allegations on Irrigation Projects Are Baseless: Minister Jupally Krishna Rao

సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటికీ ఆల్మట్టి, జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ప్రణాళిక ప్రకారం నీటి పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సాగునీటి అధికారుల సూచనల మేరకు వచ్చిన ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటి నిర్వహణ జరుగుతోందని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని జూపల్లి స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అల్లుడు అయిన సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని నిలిపివేశారన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీఆర్ఎస్ హంగామా చేస్తోందని ఆరోపించారు. జూరాలకు నీళ్లు వదలాలంటూ ప్రాజెక్టుల వద్ద ముందుగానే డ్రామాలు చేస్తూ, అధికారులు నీటిని విడుదల చేసిన తర్వాత దానిని తమ క్రెడిట్‌గా ప్రచారం చేసుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

చెడిపోయిన పంపులు, మోటార్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలను కూడా మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. భీమా ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని, జూరాలకు 50 టీఎంసీల నీటి వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు కూడా నిర్మించలేదని అన్నారు. గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను సైతం విస్మరించిందని ఆరోపించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందని జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతూ తెలంగాణ ప్రయోజనాలను సాధిస్తామని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంట కొనుగోలు, బోనస్ అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని, పాలమూరు జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి జూపల్లి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement