నకిలీలిక్కడ రెగ్యులర్‌ | Telangana Govt Probes Suspected Double Salary Scam Involving Same Aadhaar | Sakshi
Sakshi News home page

నకిలీలిక్కడ రెగ్యులర్‌

Aug 8 2026 12:51 AM | Updated on Aug 8 2026 12:51 AM

Telangana Govt Probes Suspected Double Salary Scam Involving Same Aadhaar

ఒకే ప్రభుత్వ ఉద్యోగి.. ఒకే ఆధార్‌.. రెండు వేతనాలు

ఒకే శాఖ..రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు..వేర్వేరు పేస్కేళ్లు

ఆర్థిక శాఖ ఆడిట్‌లో ఇలాంటి నిర్ఘాంతపోయే విషయాలెన్నో..

ఆర్థిక శాఖ ఆడిట్‌లో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి.. 

పలు ప్రభుత్వ శాఖల్లో కొందరు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్టుగా బట్టబయలు 

సంబంధిత ప్రభుత్వ శాఖలకు 40 మంది ఉద్యోగుల వివరాలతో జాబితా 

లోతైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం 

ఆయా విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసిన ఆర్థిక శాఖ 

అక్రమాలు తేలితే నష్టం రికవరీకి, క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆదేశం 

ఈ వ్యవహారంలో అధికారుల బాధ్యతను కూడా పరిశీలించాలని స్పషీ్టకరణ 

ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్‌లోనే ఇలాంటి తంతు..

కొందరు రెగ్యులర్‌ ఉద్యోగులూ ఔట్‌సోర్సింగ్‌ అవతారం 

తాజా బయటపడిన వ్యవహారంతో ప్రభుత్వ వర్గాల్లో సంచలనం

డి.ప్రమీల రాణి.. ప్రజారోగ్య విభాగంలో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో కె.ప్రమీల అనే పేరుతో మరో ఉద్యోగం చేస్తున్నారు. ఎంప్లాయ్‌ కోడ్‌ వేరుగా ఉన్నప్పటికీ  ఆధార్‌ నంబర్‌ మాత్రం ఒక్కటే. ఒకే ఆధార్‌ నంబర్‌తో సీడ్‌ అయిన వేర్వేరు బ్యాంకు ఖాతాలతో వేర్వేరు స్కేల్‌లో వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ఒకే వ్యక్తి మల్టిపుల్‌ కేటగిరీలో వేతనాలు డ్రా చేస్తున్నట్లు నిర్ధారించిన ఆర్థిక శాఖ..ఆ విభాగానికి సర్క్యులర్‌ జారీ చేసింది. నిర్దేశిత పద్ధతిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన ఆడిట్‌లో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ కేటగిరీలోనే కాకుండా పలు ప్రభుత్వ శాఖల్లో శాశ్వత (రెగ్యులర్‌) ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు సైతం ఒకే ఆధార్‌ నంబర్‌తో ఒకే విభాగంలో వేర్వేరు బ్యాంకు ఖాతాలతో రెండు వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. వీరంతా వేర్వేరు పేర్లతో రెగ్యులర్‌ ప్రాతిపదికన రెండు ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఉన్న పరిస్థితిని ఆధార్‌ మ్యాపింగ్‌ విధానంలో నిగ్గు తేల్చింది.

పలు ప్రభుత్వ విభాగాల్లో 40 మంది ఉద్యోగులు ఇలా డబుల్‌ వేతనాలు తీసుకున్నట్లు గుర్తించింది. కొందరైతే రెండు కంటే ఎక్కువ చోట్ల కూడా పని చేస్తున్నట్లు బయటపడింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఆయా శాఖలకు పంపింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రెండు, మూడుచోట్ల పనిచేస్తున్నట్టుగా వేతనాలు పొందడం, ప్రభుత్వ ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నట్టుగా వేతనం పొందడం వెలుగు చూడగా..తాజాగా కొందరు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్టుగా, వేతనాలు పొందుతున్నట్టుగా బయటపడటం ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వీరు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిపి దాదాపు 5 వేల మంది ఈ విధంగా ఖజానాను కొల్లగొట్టినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనలో వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 

పేరులో స్వల్ప మార్పు చేసి.. కొందరు వేరే పేరుతో 
కొందరు రెగ్యులర్‌ ఉద్యోగులు ఒకే ఆధార్‌తో తమ పేరులో చిన్న మార్పుతో రెండు ఉద్యోగాలు చేస్తున్నట్టుగా డబుల్‌ వేతనం పొందుతున్నారు. మరికొందరు ఒకే ఆధార్‌ నంబర్‌ అయినా వేరే పేరు ఉంది. తాజాగా శాఖల వారీగా ఈ డబుల్‌ ఉద్యోగాల వివరాలను క్రోడీకరించిన ఆర్థికశాఖ.. సంబంధిత శాఖాధిపతులకు జాబితాను పంపించింది.

ఇలా గుర్తించిన వాటిలో ప్రజారోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలన, పట్టణాభివృద్ధి, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయ, సహకార, హోం, రెవెన్యూ, ఉన్నత విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, గిరిజన సంక్షేమంతో పాటు ఆర్థిక శాఖ సైతం ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించి మరింత లోతైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 

ఐఎఫ్‌ఎంఐఎస్‌లో మ్యాపింగ్‌తో... 
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాను ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఐఎఫ్‌ఎంఐఎస్‌) పోర్టల్‌లో నమోదు చేసింది. ఇదివరకు కేవలం శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తం చేయగా... ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వివరాలను అందులో ఎంట్రీ చేసింది. ఇటీవల ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల అక్రమాలను తేల్చే పనిలో భాగంగా ఉద్యోగుల ఆధార్‌ నంబర్‌తో మ్యాపింగ్‌ చేసింది. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

ఒకే ఆధార్‌ నంబర్‌తో రెండు కంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు బయటపడింది. ఇలాంటి ఉద్యోగుల జాబితాను బయటకు తీసిన ఆర్థిక శాఖ.. సంబంధిత శాఖాధిపతులతో పాటు సచివాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కూడా సమరి్పంచింది. ఈ జాబితా ఆధారంగా లోతైన విచారణ చేసి నిజానిజాలను నిగ్గు తేల్చాలని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల వేతనాలు పొందుతున్నట్లు స్పష్టంగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు ఇలా..
ఆర్థిక శాఖ గుర్తించిన ప్రతి డూప్లికేట్‌ ఆధార్‌ కేసును ప్రాధాన్యతతో విచారణ చేపట్టాలి. ఒకే ఆధార్‌తో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థల నుంచి జీతం లేదా పారితోíÙకం పొందారా? వాస్తవాలను దాచారా? తప్పుడు సమాచారం ఇ చ్చారా? అనే అంశాలను నిర్ధారించాలి. 
అక్రమంగా జీతాలు పొందినట్లు తేలితే తెలంగాణ సివిల్‌ సర్విసెస్‌ (సీసీఏ) రూల్స్‌–1991 లేదా సంబంధిత సర్విస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు భారీ పెనాల్టీ విధించాలి. క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిబంధనల ప్రకారం రికవరీ చేయాలి. 

  అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, మోసం, ఫోర్జరీ, రికార్డుల తారుమారు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తదితర వర్తించే చట్టాల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ ప్రారంభించాలి. 
ఈ వ్యవహారంలో అధికారుల బాధ్యత/పాత్రను కూడా పరిశీలించాలి. ఈ అక్రమాలకు అధికారుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో వైఫల్యం లేదా కుమ్మక్కు కారణమైతే వారిపైనా బాధ్యత నిర్ధారించి, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. 
మొత్తంగా వారం రోజుల్లో యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు(ఏటీఆర్‌) సమర్పించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement