జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ | Telangana Govt Takes Key Decisions in Wake of El Nino Conditions: Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ

Aug 8 2026 1:09 AM | Updated on Aug 8 2026 1:09 AM

Telangana Govt Takes Key Decisions in Wake of El Nino Conditions: Uttam Kumar Reddy

మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ సంజయ్‌ జాజు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 

మంత్రులు ఉత్తమ్, తుమ్మల, జూపల్లి ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్‌లో ఈ మండళ్లు తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్‌ నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, ఆయకట్టు పరిస్థితులను సమీక్షించి ఏయే పంటలు వేయాలో రైతులకు శాస్త్రీయ సూచనలు ఇవ్వాలన్నారు. శనివారం నుంచే సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. 

వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే మేలు.. 
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను రైతులు సాగు చేయవద్దని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఒకసారి నీరు అందినా పంటల తర్వాతి దశలో నీరు అందించడంపై అనిశ్చితి నెలకొందని.. అందువల్ల ప్రతి ఆయకట్టులో ఎంత సాగునీరు అందించగలమో, ఎక్కడ నీటి పరిమితులు ఉన్నాయో కలెక్టర్లు, అధికారులు రైతులకు ముందే తెలియజేయాలని ఆదేశించారు.

నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరుకోనందున ఆయా ఆయకట్టు ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement