కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
సనత్‌నగర్ (హైదరాబాద్): సొంత కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సనత్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న భార్యాభర్తలకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి (45) హౌస్ కీపింగ్ పనులు చేస్తుండేవాడు. మద్యం తాగే అలవాటున్న తండ్రి రోజూ ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో ఘర్షణ పడుతుండేవాడు.
ఈ క్రమంలో తన రెండో కుమార్తెపై కన్నేసిన నిందితుడు.. భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు పరువు పోతుందనే భయంతో నోరు విప్పలేదు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై దాడి చేయడం, దుర్భాషలాడుతుండడాన్ని భరించలేని రెండో కుమార్తె (16) గురువారం సాయంత్రం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి తనపై చేసిన అకృత్యాలను బయటపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.


