హైదరాబాద్: లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వద్ద ఓ యువతి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టిన ఘటన కలకలం రేపింది. యువతిని హత్యచేసి.. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి చెత్తకుప్పలో వేసి నిప్పంటించారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
సీఐ అంజద్ అలీ, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాల వద్ద డీబీఆర్ మిల్స్ గేట్ సమీపంలోని చెత్త కుప్పల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతి మృతదేహానికి నిప్పంటించి పరారీ అయినట్లు దోమలగూడ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజిన్ సహకారంతో మంటలుఆర్పివేశారు.
మంటల్లో సుమారు 30 ఏళ్ల వయసు యువతి కాలిపోయినట్లు కనుగొన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


