breaking news
PEDDI Sudarshan Reddy
-
కేసీఆర్ వస్తారు.. మెడికల్ కాలేజీకి ‘పెద్ది’ పేరు పెడతారు
సాక్షి, వరంగల్/నర్సంపేట: తెలంగాణ ఉద్యమ బిడ్డ పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉద్యమ గడ్డ ఘనమైన గౌరవం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పెద్ది ఆశయాల మేరకు నర్సంపేటను అభివృద్ధి చేస్తామన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దశదిన కర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన నివాళులర్పించారు.పెద్ది అంతిమయాత్రకు కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓరుగల్లు మొత్తం కదిలివచ్చిందని, 12 గంటలపాటు లక్షలాది మంది తరలిరావడం ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయినా తెలంగాణ ఉద్యమంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు.చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు పెద్ది తపించారని గుర్తుచేసుకున్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభ సమయంలోనూ నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ అందించారని, రైతుల కోసం రూ.100 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టును సాధించారని తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకున్నా: హరీశ్పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకపోతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఉద్యమ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో డీసీఎం పైనుంచి కిందపడిపోయిన నన్ను.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. అదే ఆస్పత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ హరీశ్ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు లెక్కచేయకుండా పెద్ది పోరాడారన్నారు. మానుకోట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు సాధించడంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సభలో పార్టీ ముఖ్యనేతలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.ఉద్రిక్తత మధ్య విగ్రహావిష్కరణపెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ట తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించగా సంబంధిత నిర్మాణాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో సోమవారం ఉదయం పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
‘పెద్ది గద్దె’ తొలగింపుతో నర్సంపేటలో రగిలిన రాజకీయం
సాక్షి, వరంగల్: నర్సంపేటలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను రాత్రికి రాత్రే అధికారులు కూల్చివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు సమాచారం. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి పేరుతో రాత్రి వేళ కూల్చివేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ ధర్నాగద్దె కూల్చివేతకు నిరసనగా సోమవారం ఉదయం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు యత్నంధర్నా నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమించాలని సూచించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ప్రస్తుతం నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ది కుటుంబాన్ని ఆదివారం కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే.. విగ్రహ గద్దె కూల్చివేత చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
-
పెద్ది లేడని బాధపడొద్దు.. పెద్దన్నగా నేనున్నా
సాక్షి, వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆత్మీయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లికి మధ్యాహ్నం 3.50 గంటలకు వచ్చారు. తొలుత పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పెద్ది భార్య స్వప్న, పిల్లలు, తల్లి అమృతమ్మ, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిల్లలను అక్కున చేర్చుకుని కాసేపు దుఃఖించారు. విషణ్ణ వదనంతో మౌనంగా ఉండిపోయారు. పెద్ది కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ‘పెద్ది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎలాంటి ఆందోళన చెందొద్దు. ధైర్యం కోల్పోవద్దు. కుటుంబానికి పెద్దదిక్కుగా నేనున్నా. పార్టీ అండగా ఉంటుంది’అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తల్లి అమృతమ్మ, భార్య స్వప్నకు ధైర్యం చెప్పిన ఆయన... పిల్లలు బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఉద్యమ సహచరుడిని తలచుకొని.. తెలంగాణ ఉద్యమం..బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోషించిన కీలక పాత్రను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పెద్ది చేసిన కృషిని, తనతో ఆయనకున్న సుదీర్ఘ ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, కల్మషం లేని హృదయంతో అందరితో కలిసిపోయే పెద్ది ఇక లేరనే బాధతో కేసీఆర్ కొద్దిసేపు మాటలు రాక మౌనంగా ఉండిపోయారు. పరిస్థితిని గమనించిన పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను అనునయించడంతో కొంత తేరుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధరి్మష్ఠకు రూ.కోటి చొప్పున రూ.2 కోట్ల చెక్కులు, పెద్ది తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చెక్కును అందించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. -
నల్లబెల్లికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ చిత్ర పటానికి నివాళులు
నల్లబెల్లి: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లికి వచ్చారు. నల్లబెల్లిలో.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ చిత్ర పటానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేసీఆర్ రాకతో అక్కడకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.ఇటీవల పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉండడంతో ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేస్తారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ ఇటీవలే తెలిపారు. -
‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఇటీవల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందగా.. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.తద్వారా మొత్తంగా 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. -
9న నల్లబెల్లికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల దివంగతులైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. ఈ నెల 9న నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసంలో ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో కేసీఆర్ భేటీ అవుతారు. ఇదిలా ఉంటే ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 9న నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు.10న హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగే సంస్మరణ సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సంస్మరణ సభల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు మంగళవారం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సుమారు 30 మంది ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలకు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో జరిగే సంస్మరణ సభ, దశ దినకర్మకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నల్లబెల్లిలో చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు చర్చించారు. -
ఉద్యమ ఊపిరి ‘పెద్ది’కి కన్నీటి వందనం
సాక్షి, వరంగల్: తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి శుక్రవారం వేలాదిమంది ప్రజలు, ఉద్యమకారులు కన్నీటి నివాళి అర్పించారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి హనుమకొండలోని అమరువీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చిన పెద్ది పార్థివదేహానికి వందలాది మంది నివాళులర్పించారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా నర్సంపేట రోడ్డు మార్గంలో ఆ నియోజకవర్గం ప్రారంభమయ్యే గిర్నిబావి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర జనసంద్రంగా సాగింది. రహదారి మొత్తం కన్నీటి సముద్రంగా మారగా.. ‘పెద్ది అమర్ రహే‘, ‘జోహార్ పెద్దన్న‘నినాదాలతో మార్మోగిపోయింది. ఉదయం 9.30 గంటలకు గిర్నిబావికి చేరుకున్న పెద్ది పారి్థవదేహం ఉన్న రథం.. లక్నెపల్లి, మహేశ్వరం, నర్సంపేట, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, రుద్రగూడెం, నారక్కపేట మీదుగా నల్లబెల్లి చేరుకున్నాక రాత్రి 10 గంటలకు పెద్ది వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ముగిశాయి. సాధారణంగా గంటలో పూర్తయ్యే ఈ ప్రయాణం. ప్రతీ గ్రామంలో ప్రజలు చివరిసారి తమ నాయకుడిని చూసేందుకు పోటీపడటంతో గంటల తరబడి సాగింది. ఘొల్లుమన్న గిర్నిబావి... అంతిమయాత్ర ప్రారంభమైన గిర్నిబావిలో ‘మళ్లీ ఎప్పుడూ వస్తావు పెద్దన్నా’అంటూ మహిళలు విలపించిన తీరు హృదయాలను కదిలించింది. రహదారుల వెంట నిలబడ్డ ప్రజలే కాదు... వెళ్తున్న బస్సుల్లోని ప్రయాణికులు కూడా కిటికీల్లో నుంచి బయటకు వంగి పెద్ది పారి్థవదేహానికి చేతులెత్తి నమస్కరించారు. భార్య స్వప్న కన్నీళ్లు..గుండెల్ని పిండేశాయి పారి్థవదేహంతో సాగుతున్న రథంలో ఉన్న ఆయన సతీమణి పెద్ది స్వప్న ప్రజలను చూస్తూ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు నిదర్శన్‌రెడ్డి మధ్యమధ్యలో తల్లి కన్నీళ్లు తుడవడం కనిపించింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసి అభిమానులు, కార్యకర్తలు బోరున విలపించారు. అన్న లే అన్నా...రాఖీ తెచ్చానంటూ పెద్ది సోదరి విలపించడం కంటతడి పెట్టించింది.నర్సంపేట స్వచ్ఛంద బంద్ తమ అభిమాన నాయకుడికి నివాళిగా నర్సంపేట పట్టణం స్వచ్ఛందంగా బంద్ పాటించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగామూసివేయగా, పాఠశాలలు కూడా సెలవు ప్రకటించాయి. అయ్యప్ప టెంపుల్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వేలాదిమంది ప్రజలు ర్యాలీగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు గిద్దె రాంనర్సయ్య, దార దేవేందర్ ఆలపించిన నివాళి గీతాలు వేలాదిమందిని కంటతడి పెట్టించాయి. చివరి చూపునకు ప్రముఖుల రాక... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ , మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయిన్పల్లి వినోద్‌కుమార్, మాలోతు కవితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యలు కూడా నల్లబెల్లిలో నివాళులర్పించారు. నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. నల్లబెల్లిలోని నివాసం నుంచి ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రావు, పాడికౌశిక్రెడ్డిలు పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది ప్రజల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు నిదర్శన్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. -
అశ్రునయనాల మధ్య కొనసాగుతున్న పెద్ది అంతిమయాత్ర
-
పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు.పార్టీ పట్ల ఆయన అంకితభావం, ప్రజల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్న కేసీఆర్, ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటని అన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.హరీష్ సంతాపం..అలాగే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృత్యువును జయించి తిరిగి వస్తారని ఆశించామని, కానీ ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. వ్యక్తిగతంగా ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ "పెద్దన్నకు జోహార్లు" అని నివాళులర్పించారు.సీఎం సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.కేటీఆర్ సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయన ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న కేటీఆర్.. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రాత్రి 12.51 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ నెల 26న హనుమకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. దాదాపు గంటపాటు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ నిర్వహించగా.. కొంత స్పందన కనిపించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.యశోద ఆస్పత్రిలో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం, ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.తెలంగాణ ఉద్యమం ద్వారా.. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చురుగ్గా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. 2001లో అప్పటి తెరాస (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు పార్టీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
సుదర్శన్‌రెడ్డికి కేసీఆర్ పరామర్శ
సాక్షి, సికింద్రాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.కేసీఆర్ అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సికింద్రాబాద్ వచ్చారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి సుదర్శన్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట పార్టీ నేతలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్, సంజయ్ కుమార్, సంతోష్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ రాకతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిచ్చారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది.చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు -
పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత
హనుమకొండ/నర్సంపేట/ఉప్పల్/రాంగోపాల్‌పేట/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో దినపత్రిక చదువుతుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు.దీంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటల సమయంలో కార్డియాలజిస్టు మమత, డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. డాక్టర్ మమత 9 సార్లు సీపీఆర్ చేశారు. కొద్దిగా కోలుకున్న తర్వాత అంజియోగ్రామ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. రక్తనాళాల్లో గడ్డలు గుర్తించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకోసం అంబులెన్సుకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేసి దారిని సుగమం చేసారు. పరిస్థితి విషమం! మధ్యాహ్నం 3 గంటల సమయంలో యశోదా ఆస్పత్రికి చేరుకోగా..వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి మెరుగుపడని పక్షంలో ఎక్మోపై ఉంచాలని ఆలోచిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అత్యుత్తమ చికిత్సకు కేసీఆర్ ఆదేశాలు సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. కాగా కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు, నేతలు పోంచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోయినిపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, పింగిళి శ్రీపాల్‌రెడ్డి తదితరులు రోహిణి ఆస్పత్రికి వెళ్లారు. తర్వాత సికింద్రాబాద్ ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీలు మాలోతు కవిత, వినోద్‌కుమార్, ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్ మమతారెడ్డి సేవలు అమూల్యం: హరీశ్‌రావు సుదర్శన్‌రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ మమతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. పలుమార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను తిరిగి తీసుకురావడంలో ఆమె చూపిన నైపుణ్యం, ధైర్యం, అంకితభావం.. వైద్యపరమైన అద్భుతంతో సమానమని సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. -
మాజీ MLA ఆరోగ్యంపై KTRకు KCR ఆదేశాలు
-
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ అప్రమత్తం చేశారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మీడియాతో రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందన్నారు. గుండెపోటుతో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్ ఉందన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.సుదర్శన్‌రెడ్డి చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరారు. -
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యుల వెల్లడి
సాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉన్నట్లు రోహిణి ఆసుపత్రి సుపరిండెంట్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు పెద్దిని వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం కొనసాగుతోంది. అయితే, పెద్ది మరణించారంటూ వస్తున్న వార్తలపై రోహిణి హాస్పిటల్ సుపరిండెంట్ సుధాకర్ రెడ్డి ఖండించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. సీపీఆర్ జరుగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మీడియాకు తెలిపారు.‘‘నిన్న రాత్రి సీటీ స్కాన్‌తో పాటు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యులు నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు వైద్య బృందం ద్వారా తెలియజేస్తాయని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్, హరీష్‌రావు బయలుదేరారు. -
'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం'
హైదరాబాద్: ప్రగతి భవన్‌ను పేల్చేయాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పాదయాత్రకు ఆదరణ కరువు కావడంతో అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపునివ్వడమేంటమని మండిపడ్డారు. 'రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. భట్టి విక్రమార్క రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమాలేక వ్యక్తిగతమా చెప్పాలి. కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బయట తిరగలేడు.. 'రేవంత్‌వి అన్ని అబద్ధాలే. వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనర్హుడికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు క్షమాపణ చెప్పాలి' అని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్.. 'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ ఖతం. తెలుగుదేశంలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. రేవంత్‌ను ప్రజలు ఐటెం సాంగ్ గానే చూస్తారు. ఆయన వెంట ఉండేవారు కిరాయివాళ్లే. నర్సంపేటలో పాదయాత్ర ఎందుకు చేయలేదు? అక్కడ తంతారనా? రేవంత్ ఓ బ్రోకర్. ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. మోదీ ఆఫీస్‌ను కూడా పేల్చేయాలని రాహుల్ గాంధీకి రేవంత్ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. నక్సలైట్ల ఎజెండా మంచిగానే ఉంటుంది. నాకు చదువు రాకపోతేనే ఏడు సార్లు గెలిచానా?' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు! -
కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా?
నర్సంపేట: ‘చెప్పుల దుకాణం యజమానిలా మాట్లాడుతున్నావు, కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా?’అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఉద్దేశించి అన్నారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నోటి దురుసు తగ్గించుకోవాలని హితవుపలికారు. వైఎస్.రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేశారని, కానీ ఇలా చిల్లర మాటలు ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. నిరాధారమైన, అసత్యమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. -
అమరవీరుల స్థూపం వద్ద ఆత్మహత్యా యత్నం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లాలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. అదాలత్ జంక్షన్ అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పలువురు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కాగా, తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణమని బాధితుడు ఓ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి : తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా) -
రొట్టె కాల్చుతా.. ఓటు పట్టుతా..
ఖానాపురం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి మండలంలోని తండాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాజీతండాకు చెందిన యువతులు, మహిళలు ఘన్ఘోర్మాత విగ్రహాలతో ఘనస్వాగతం పలికారు. బోటిమీదితండాలో గిరిజన మహిళతో కలిసి జొన్నరొట్టెలు తయారుచేశారు. -
అభివృద్ధి బాధ్యత ఎవరిది..?
♦ గెలిచిన ఎమ్మెల్యేదా..ఓడిన వారిదా..! ♦ రూ.కోట్ల నిధులు తెచ్చినా.. ♦ అడ్డుకుంటున్నదెవరు..? ♦ రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ ♦ పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట: నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విమర్శంచడం సరైందికాదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేపై ఉంటుందా.. ఓడిన వారిపై ఉంటుందా.. అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని సర్వాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గానికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్యే, అతని అనుచరులు కాంట్రాక్టులు పొంది పనులు చేపట్టడంలో తాత్సారం చేయడంలేదా అని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక్క ఎకరానికైనా నీరందించిందా అనే ముందు మాధవరెడ్డి వాస్తవాన్ని గుర్తించాలని హితవు పలికారు. మిషన్ కాకతీయ ఫెజ్–1,2,3 కింద 219 చెరువుల పునరుద్ధరణకు రూ.88.45 కోట్లు ప్రభుత్వం మంజూరుచేయగా 50శాతం కాంట్రాక్టర్లు మీరే కదా అని గుర్తు చేశారు. మాధన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేయాలని రూ.7.50కోట్లు మంజూరు చేయించామని, రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు జాప్యం చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 పథకాలు చెప్పి తొమ్మిది పథకాలు అమలు చేసిందని, మూడేళ్లుగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగి కనీసం నర్సంపేట అభివృద్ధిపై శాసనసభలో ఒక్కసారైనా గళం విపారా అని మాధవరెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూరం కూడా నిర్మించలేకపోయిందంటున్న ఆయనకు నిర్మాణానికి సంబంధించి పూర్తి అధికారలను ఎమ్మెల్యేలకు కల్పిస్తూ సీఎం జీవో జారీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. నర్సంపేటకు మంజూరైన ఇళ్ల కోసం ఇంత వరకు ఎందుకు ప్రతిపాదనలు పప్పించకుండా అడ్డుకున్నదేవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, దార్ల రమాదేవి, గుంటికిషన్, నాగెల్లి వెంకటనారాయణ, బండి రమేష్, నాగిశెట్టి ప్రసాద్, పుట్టపాక కుమారస్వామి, బండి ప్రవీణ్, సందీప్, మందుల శ్రీనివాస్, మచ్చిక నర్సయ్య, దారంగుల నగేష్, బైరి మురళి పాల్గొన్నారు. -
రైల్వే కోర్టుకు హాజరైన పౌరసరఫరాల సంస్థ చైర్మన్
నెక్కొండ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు పది మందిపై 2009లో వరంగల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గురువారం కాజీపేట రేల్వే కోర్టుకు ప్రస్తుత పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటుక సోమయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్పాషాతో పాటు ఉద్యమకారులు తాళ్లూరి లక్ష్మయ్య, అల్లి యాదగిరి, బండి యాకయ్య, మాదాసి యాకయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, పరకాల భిక్షపతి హాజరయ్యారు. కోర్టుకు తొమ్మిది మంది మాత్రమే హాజరుకావడంతో ఈ కేసును రైల్వే కోర్టు జనవరికి వాయిదా వేసింది. -
సీఎంఆర్ నిబంధనల సడలింపు!
► పౌరసరఫరాల శాఖ అధికారుల భేటీలో మంత్రి ఈటల నిర్ణయం ► మిల్లర్లకు చివరి అవకాశం సాక్షి , హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను అత్యధికంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణ యానికి వచ్చింది. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వినియోగిస్తున్న సర్కారు వీటికి అవసరమైన వడ్లను స్టేట్ పూల్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందు కోసం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిబం ధనలను స్వల్పంగా సడలించాలను కుం టోంది. ఈ మేరకు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం సచివాలంయలో పౌర సరఫరాలశాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణను తక్కువ సమయంలో పూర్తి చేయడానికి మిల్లర్లకు కూడా చివరి అవకాశం ఇద్దామని ఈటల ఈ భేటీలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పొరపాట్లకు తావివ్వకుండా సీఎంఆర్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గతంలో అక్రమ దందాలకు పాల్పడిన మిల్లర్లు, రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసిన మిల్లర్లకు సంబంధించిన కేసుల తీవ్రతనుబట్టి సీఎంఆర్ కోసం ధాన్యం ఇవ్వకూడదని నిర్ణరుుంచారు. స్టాకులో తేడాలు, సీఎంఆర్ బకారుుల తది తరాలపై నమోదైన కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ఈసారికి సీఎంఆర్‌లో ధాన్యం ఇవ్వాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రారం భమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించేలా, రైతులకు ధాన్యం సొమ్ము సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈటల ఆదేశిం చారు. రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థారుులో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని, 900 మెట్రిక్ టన్నుల ఉప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యావస రాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వ్యాపా రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. -
గిరి పుత్రుడికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
గిర్నిబావి(దుగ్గొండి) : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించిన నూనావత్ విశాల్ ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.లక్ష మంజూరైంది. ఈ మేరకు చెక్కును విశాల్ తల్లిదండ్రులు రాందన్–వినోదకు టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం అందజేశారు. మండలంలోని పిల్లిగుండ్ల తండాకు చెందిన విశాల్‌కు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిల్ స్కూల్లో సీటు లభించింది. హాస్టల్, తదితర ఖర్చుల కింద రూ.లక్ష డిపాజిట్ చేయాలని పేర్కొనడంతో.. ఆయన తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. ఈ విషయమై మార్చి 17న ‘సాక్షి’లో ‘గిరిపుత్రుడిని ఆదరించరూ’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు అప్పట్లో ఎస్సై వెంకటేశ్వర్లు కొంత ఆర్థికసాయం అందించగా.. టీఆర్ఎస్ నేత సుదర్శన్‌రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేయించారు. దీంతో చెక్కు రాగా, ఆదివారం విశాల్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా రాందన్–వినోద మాట్లాడుతూ తమకు తోడ్పాటునందించిన సాక్షి దినపత్రికు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లావుడ్యా లలితతో పాటు ఆకుల శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మహిపాల్‌రెడ్డి, గుడిపెల్లి జనార్ధన్‌రెడ్డి, ఎర్రల్ల బాబు, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, నాతి వెంకటేశ్వర్లు, మేర్గు రాంబాబు, కృష్ణ పాల్గొన్నారు. -
ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి నెక్కొండ: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుందని టీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నెక్కొండ మండలాన్ని మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఆ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నందున..ఆ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించారన్నారు. నెక్కొండ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు వరంగల్ జిల్లాలో కలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్ నబీ, వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి, రామాలయ కమిటీ చైర్మన్ గన్ను కృష్ణ, నాయకులు అంబాల రాంగోపాల్, తాళ్లూరి లక్ష్మయ్య, చల్లా చెన్నకేశవరెడ్డి, మారం రాము, పొడిశెట్టి సత్యం, గరికపాటి కృష్ణారావు, పలుసం విశ్వనాథం, లావుడ్యా హరికిషన్‌నాయక్, కందిక మాణిక్యం, చల్లా వినయ్‌రెడ్డి, పాష తదితరులు పాల్గొన్నారు. ‘మిషన్ కాకతీయ’ను సద్వినియోగం చేసుకోవాలి నర్సంపేట రూరల్: మిషన్ కాకతీయు పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం వుండలంలోని లక్నేపల్లి శివారులోని పెద్ద చెరువు, కొత్తచెరువు పునరుద్ధరణ పనులను ఎంపీపీ బాదావత్ భద్రవ్ముతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయున వూట్లాడారు. కార్యక్రవుంలో సర్పంచ్ కొడారి కవితారవి, ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్, టీఆర్ఎస్ వుండల అధ్యక్షుడు వుచ్చిక నర్సయ్యు, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కుంచారపు వెంకట్‌రెడ్డి, ఏఈ యూదగిరి పాల్గొన్నారు. -
'చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేమెందుకు అడ్డుకుంటాం'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ లే హైదరాబాద్ లో సెటిలర్లని, మిగిలిన వారంతా తెలంగాణ బిడ్డలేనని టీఆర్ ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అసలు 'సెటిలర్' అన్న పదాన్ని సృష్టించిందే టీడీపీ అన్నారు. తమ పార్టీలో సీమాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల వారుకూడా సభ్యత్వం పొందేందుకు తహతహలాడుతున్నారని తెలిపారు. అయితే టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తామెందుకు అడ్డుకుంటామని, తమ దృష్టంతా అభివృద్ధిపైనే ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. -
చిన్నబోయిన పెద్ది
తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారిలో నలుగురు ప్రజాప్రతినిధులు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వీరు ఉద్దేశపూర్వకంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డిని దూరం పెడుతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారుు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పలు ఉప ఎన్నికల్లో పదేపదే చెప్పిన కేసీఆర్... జిల్లాలో ఉద్యమ నేతగా వ్యవహరించిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాజకీయంగా ఎలా అండగా నిలుస్తారని గులాబీ వర్గాల్లో ఇప్పుడు చర్చజరుగుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలో టీఆర్ఎస్ను అన్నీ తానై నడిపించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవలి కాలంలో స్తబ్దుగా ఉంటున్నారు. జిల్లాలో ఎక్కడైనా, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇబ్బంది వస్తే... ఆయన వెంటనే అక్కడ వాలేవారు. అందరికీ అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చక్కబెట్టేవారు. అలాంటి సుదర్శన్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అన్ని కీలక సందర్భాల్లో పార్టీ తరఫున పెద్ది క్రియాశీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ హవాలో సైతం నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఓడిపోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. మొదటి నుంచీనుంచీ ఉద్యమంలో ఉన్నా... తాను ఎలా ఓటమి చెందానని మదనపడుతున్నారు. ఈ కారణాలతోనే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయాల్లో ఆయనను అనునయించి... క్రియాశీలకం చేయాల్సిన పార్టీ ప్రజాప్రతినిధులు ఈ పనిచేయడం లేదని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారిలో మధుసూదనాచారి మాత్రమే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. మిగిలిన వారందరూ ఆ తర్వాత పార్టీలో చేరిన వారే. వీరందరినీ టీఆర్ఎస్లోకి తీసుకురావడంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పాత్ర ఉంది. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారిలో నలుగురు ప్రజాప్రతినిధులు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వీరు ఉద్దేశపూర్వకంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డిని దూరం పెడుతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారుు. విద్యార్థి దశ నుంచే ఉద్యమం నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటర్మీడియుట్లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో పనిచేశారు. అనంతరం గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యుూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్లబెల్లిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డిపై విజయుం సాధించారు. ఆ తర్వాత ప్రతక్ష్య ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2004లో పొత్తులో భాగంగా నర్సంపేట స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కె.లక్ష్మారెడ్డి పోటీ చేశారు. ఈయన విజయానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేశారు. 2005లో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నర్సంపేట సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుపు కోసం ఆ ఎన్నికల్లో పెద్ది కృషి చేశారు. పెద్ది సుదర్శనరెడ్డి 2013 వరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి వ్యవహరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఉండకూడదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణరుుంచడంతో పెద్ది.. ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. 2013లో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను టి.రవీందర్‌రావుకు అప్పగించడంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా ఇన్చార్జ్గా నియమితులయ్యారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది క్రమక్రమంగా పార్టీకి దూరమయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన వారు స్తబ్దుగా ఉండిపోయారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబీ దళానికి నేతృత్వం వహించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు నిరాహార దీక్ష, ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో పెద్ది కీలకంగా వ్యవహరించారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు టీఆర్ఎస్ తరఫున అన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న సమయంతోపాటు తెలంగాణ ఆవిర్భావం వరకు జరిగిన అన్ని సందర్భాల్లోనూ జిల్లాలో ఆయన టీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఏక కాలంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ కీలక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి... నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఓటమి చెందడం ఆయనను కుంగదీసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. పెద్ది సుదర్శనరెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పలు ఉప ఎన్నికల్లో పదేపదే చెప్పిన కేసీఆర్... జిల్లాలో ఉద్యమ నేతగా వ్యవహరించిన పెద్ది సుదర్శనరెడ్డికి రాజకీయపరంగా ఎలా అండగా నిలుస్తారనేది గులాబీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. -
సార్వత్రిక పోరులో విజయం మాదే
నర్సంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయుంలో గురువా రం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ను ప్రజలు గుర్తించి ఆదరించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 25వేల ఓట్ల మెజార్టీతో తాను విజయుం సాధిస్తానని ధీవూ వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు, పార్టీల కార్యకర్తలు వుుందుకు వచ్చారని తెలిపారు. తనను ఓడించడం కోసం కొన్ని శక్తులు ప్రయుత్నించినా వారికి ఫలితం ఉండబోదన్నారు. సవూవేశంలో నాయకులు ఎంవీ.రావూరావు, నారుుని నర్సయ్యు, కుంచార పు వెంకట్‌రెడ్డి, పుట్టపా కువూరస్వామి, బైరి తిరుపతిరెడ్డి, దార్ల రవు, గుంటి కిషన్, శ్రీనివాస్, తోట సుదర్శన్, యూదగిరి, మోడెం రావుకృష్ణగౌడ్, బబ్లూ, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం జరిగే జిల్లా బంద్‌లో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆర్టీసీ పూర్తిగా సహకరించాలని కోరారు. కాగా, బంద్‌కు సీపీఐ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్ సందర్భంగా ఆటోలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రీజినల్ సెక్రటరీ డీఆర్రెడ్డి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నా శివకుమార్, కక్కెర్ల అనిల్‌కుమార్ బంద్‌కు మద్దతు తెలిపారు.


