ఆదివారం పెద్ది సుదర్శన్‌రెడ్డిని యశోద హాస్పిటల్‌కు తరలిస్తున్న వైద్య సిబ్బంది
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే
ఉదయం హనుమకొండ నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తొలుత రోహిణి ఆస్పత్రికి..9 సార్లు సీపీఆర్ చేసిన డాక్టర్ మమత
తర్వాత హైదరాబాద్‌కు తరలింపు
సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా
హనుమకొండ/నర్సంపేట/ఉప్పల్/రాంగోపాల్‌పేట/సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో దినపత్రిక చదువుతుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు.
దీంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటల సమయంలో కార్డియాలజిస్టు మమత, డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. డాక్టర్ మమత 9 సార్లు సీపీఆర్ చేశారు. కొద్దిగా కోలుకున్న తర్వాత అంజియోగ్రామ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. రక్తనాళాల్లో గడ్డలు గుర్తించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకోసం అంబులెన్సుకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేసి దారిని సుగమం చేసారు.
పరిస్థితి విషమం!
మధ్యాహ్నం 3 గంటల సమయంలో యశోదా ఆస్పత్రికి చేరుకోగా..వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి మెరుగుపడని పక్షంలో ఎక్మోపై ఉంచాలని ఆలోచిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అత్యుత్తమ చికిత్సకు కేసీఆర్ ఆదేశాలు
సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. కాగా కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు, నేతలు పోంచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోయినిపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, పింగిళి శ్రీపాల్‌రెడ్డి తదితరులు రోహిణి ఆస్పత్రికి వెళ్లారు. తర్వాత సికింద్రాబాద్ ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీలు మాలోతు కవిత, వినోద్‌కుమార్, ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
డాక్టర్ మమతారెడ్డి సేవలు అమూల్యం: హరీశ్‌రావు
సుదర్శన్‌రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ మమతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. పలుమార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను తిరిగి తీసుకురావడంలో ఆమె చూపిన నైపుణ్యం, ధైర్యం, అంకితభావం.. వైద్యపరమైన అద్భుతంతో సమానమని సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు.


