జై జవాన్‌.. జై కిసాన్‌.. జై 'యువ' | CM Revanth Reddy Comments with national media | Sakshi
Sakshi News home page

జై జవాన్‌.. జై కిసాన్‌.. జై 'యువ'

Jul 27 2026 1:45 AM | Updated on Jul 27 2026 1:45 AM

CM Revanth Reddy Comments with national media

ఈ నినాదంతోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది

జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పార్లమెంట్‌లోకి రావడానికి,చట్టాలు చేయడానికీ యువత సిద్ధంగా ఉంది  

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించాలి 

వయోపరిమితి తగ్గింపుపై వర్షాకాల సమావేశాల్లోనే చర్చ జరగాలి 

జేపీసీ ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకోండి 

ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు.. వినడమూ అలవర్చుకోవాలన్న సీఎం 

రాహుల్‌గాంధీ కోరినట్టు జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుందని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: వికసిత్‌ భారత్‌ 2047, సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‌‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్‌లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు.  

విని, ఆలోచించి, చట్టం చేయాలి 
‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్‌ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్‌ కీ బాత్‌‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 

21, 25 సంవత్సరాలకు తగ్గించాలి 
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్‌ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.  

మోదీకి ఇది రెండో పరాజయం 
‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్‌గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు.  

ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి 
విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్‌ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్‌ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్‌ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని  ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా మాత్రమే కాదు.. నీట్‌ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్‌ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్‌గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.  

ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. 
‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్‌ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement