ఒకే ఇంట్లో పుట్టారు.. కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు.. కానీ ఇప్పుడు ఇద్దరి భవిష్యత్తూ జైలు గోడల మధ్యే! 19 ఏళ్ల కవల సోదరీమణులు టరానెహ్, రొమినా రహిమీ.. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. నాలుగు నెలల పాటు ఆచూకీ కోసం వారి తల్లి.. ఆస్పత్రులు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగింది. చివరకు జైలులో కూతుళ్లను చూసిన ఆమె.. ముఖాలు వాచిపోయి, శరీరాలపై గాయాలతో ఉన్న వారిని చూసి షాక్‌కు గురైంది. ఇప్పుడు టరానెహ్‌కు మరణశిక్ష, రొమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు కుటుంబం చెబుతోంది. ఒక కూతురిని ఉరితాడి నుంచి కాపాడేందుకు.. ఆ తల్లి ఇప్పుడు ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది.
వివరాల మేరకు.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో టరానెహ్, రొమినా పాల్గొన్నారని వారి కుటుంబం తెలిపింది. జనవరి 8, 9 తేదీల్లో షోహదా స్క్వేర్ ప్రాంతంలో జరిగిన ఆందోళనల్లో వారు నినాదాలు చేశారని బంధువులు చెప్పారు. ఆ తర్వాత ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ఇద్దరు సోదరీమణులను తీసుకెళ్లారని కుటుంబం ఆరోపించింది. వారి తలలకు సంచులు కప్పి తీసుకెళ్లారని, వారు ఎక్కడ ఉన్నారో కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులని తర్వాత గుర్తించినట్లు కుటుంబం పేర్కొంది.
కూతుళ్లు ఎక్కడున్నారో తెలియక వారి తల్లి మార్జీహ్ నౌర్మొహమ్మది ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగారు. దాదాపు నాలుగు నెలల తర్వాత కుటుంబానికి ఫోన్ వచ్చింది. తమ కూతుళ్లు జైలులో ఉన్నారని, వచ్చి కలవాలని చెప్పినట్లు బంధువు మసూద్ నౌర్మొహమ్మది వెల్లడించారు.
కూతుళ్లను చూసి షాక్
మేలో ఇస్ఫహాన్‌లోని దౌలతాబాద్ జైలులో తల్లికి కూతుళ్లను చూసేందుకు అనుమతి లభించింది. అయితే అక్కడ కనిపించిన తమ పిల్లలను చూసి ఆమె షాక్‌కు గురయ్యారని కుటుంబం తెలిపింది. ముఖాలు వాచిపోయి, శరీరాలపై గాయాలు కనిపించాయని.. చేతులు, మోచేతులు, కాళ్లకు గాయాలున్నాయని కుటుంబం ఆరోపించింది. జైలులో సిబ్బంది తమను ఒక సెల్ నుంచి మరో సెల్‌కు జుట్టు పట్టుకుని లాగేవారని సోదరీమణులు చెప్పినట్లు బంధువు తెలిపారు.
ఒకరికి ఉరి.. మరొకరికి 27 ఏళ్ల జైలు
జనవరి నిరసనలకు సంబంధించిన కేసులో మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు బాధిత కుటుంబం తెలిపింది. వారిపై మోలోటోవ్ కాక్‌టెయిల్స్ తయారు చేయడం, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. మొహరెబెహ్ అంటే ‘దేవుడిపై యుద్ధం’ అనే అభియోగం కూడా మోపినట్లు కథనం పేర్కొంది. ఇరాన్‌లో ఇది మరణశిక్షకు దారితీసే నేరంగా పరిగణించబడుతుంది. అయితే తమ కూతుళ్లు ఎలాంటి హింసకు పాల్పడలేదని కుటుంబం చెబుతోంది. జూలైలో ఇస్ఫహాన్ జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో సోదరీమణులను హాజరుపరిచారని, ఆగస్టు చివర్లో టరానెహ్‌కు మరో తొమ్మిది మందితో కలిసి మరణశిక్ష విధించినట్లు కుటుంబం తెలిపింది. రొమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు పేర్కొంది.
شنق بعد اغتصاب!.. هذه قصة الفتاة الإيرانية ترانه رحيمي التي انتزعت منها اعترافات إعدامها تحت تهديد الاغتصاب#ترانه_رحيمي #رومينا_رحيمي #إيران #أصفهان #احتجاجات_إيران pic.twitter.com/IZMuuwJ7wl
— blinx (@BlinxNow) September 18, 2026
ఇదిలా ఉండగా.. అరెస్టు తర్వాత వారిద్దరినీ వేర్వేరు గదుల్లో నిర్బంధించారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఒకరి అరుపులు మరొకరికి వినిపించేలా ఉండేవని తెలిపింది. తీవ్రంగా కొట్టడం, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు, కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులు ఆరోపించినట్లు కథనం పేర్కొంది.
ఐక్యరాజ్యసమితికి కుటుంబం..
టరానెహ్ మరణశిక్షను నిలిపివేసేందుకు, రొమినాకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు కుటుంబం అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది. బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాదుల ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాల కింద కేసుకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించినట్లు కథనం తెలిపింది. ఇక, టరానెహ్ గుర్రాలపై ఆసక్తి ఉన్న క్రీడాకారిణి కాగా.. రొమినా స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా కుటుంబం వివరించింది. నిరసనలకు ముందు ఇద్దరూ షోహదా స్క్వేర్ సమీపంలోని ఓ షూ దుకాణంలో పార్ట్‌టైమ్‌గా పనిచేసేవారని తెలిపింది.
ఇదీ చదవండి: బీచ్‌లో అమ్మాయిలతో అదేం పని.. వీడియో వైరల్


