గబ్బిలాల పుట్టినిల్లు ఐరోపానే! | Bats Evolved Europe 65 Million Years Ago, Genome Study Finds | Sakshi
Sakshi News home page

గబ్బిలాల పుట్టినిల్లు ఐరోపానే!

Sep 25 2026 11:17 AM | Updated on Sep 25 2026 11:32 AM

Bats Evolved Europe 65 Million Years Ago, Genome Study Finds

జీవ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచే సంచలన విషయాన్ని శాస్త్రవేత్తలు బహిర్గతం చేశారు. గబ్బిలాలు సుమారు 6.5 కోట్ల (65 మిలియన్లు) సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలోనే మొదటగా పరిణామం చెందాయని ‘నేచర్’ అంతర్జాతీయ పరిశోధనా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇప్పటివరకు ఆసియా, ఆఫ్రికా లేదా ఉత్తర అమెరికా ఖండాల్లో గబ్బిలాలు ఉద్భవించాయనే అంచనాలను ఈ అధ్యయనం పటాపంచలు చేసింది.

ప్రాజెక్ట్ ‘బ్యాట్‌1కే’ విజయం

‘Bat1K’ కన్సోర్టియమ్ నేతృత్వంలో 64 దేశాలకు చెందిన 137 మంది జీవశాస్త్రవేత్తలు దాదాపు దశాబ్ద కాలం పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ప్రఖ్యాత పరిశోధకులు ఎమ్మా టీలింగ్, నెన్సీ సిమ్మన్స్ వంటి ప్రముఖుల భాగస్వామ్యంతో జరిగిన ఈ పరిశోధనలో ప్రస్తుతం ఉన్న 21 గబ్బిలాల వర్గాలకు చెందిన 103 రకాల జీవుల సంపూర్ణ జెనోమ్ (డీఎన్‌ఏ)ను సీక్వెన్సింగ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా లభించిన 44 ప్రాచీన శిలాజాల డేటాతో ఈ జన్యు సమాచారాన్ని సరిపోల్చారు.

ఐరోపా నుంచి ప్రపంచవ్యాప్త విస్తరణ

ఈ జెనోమిక్ విశ్లేషణ ప్రకారం, డైనోసార్లు అంతరించిన కాలం (సుమారు 6.5 కోట్ల ఏళ్ల క్రితం)లో ఐరోపాలో మొదటిసారిగా గబ్బిలాలు పుట్టాయి. అక్కడ నుంచి ముందుగా ఆఫ్రికాకు చేరుకుని ‘యూరో-ఆఫ్రికా హబ్’గా మారాయి. ఆ తర్వాత కాలంలో ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించాయని జన్యు మ్యాపింగ్ స్పష్టం చేస్తోంది.

ఎకోలొకేషన్.. ఎగిరే సామర్థ్యం

క్షీరదాల్లో సజావుగా ఎగరగల ఏకైక జీవి గబ్బిలమే(రెక్కలతో నిజమైన విమానంలా స్వయంగా ఎగరలిగే శక్తి గబ్బిలానికి మాత్రమే ఉంది. ఇతర జీవివులు గాల్లో తేలుతూ ఎగురుతాయి). చీకట్లో శబ్ద తరంగాల ద్వారా మార్గాన్ని గుర్తించే ఎకోలొకేషన్ సామర్థ్యం, ఎగిరే నైపుణ్యం రెండూ గబ్బిలాల పరిణామ క్రమం ఆరంభంలోనే రూపుదిద్దుకున్నాయని ఈ పరిశోధన తేల్చింది.

మానవ వైద్య రంగానికి కీలకం

గబ్బిలాలు అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను మోస్తూ కూడా అనారోగ్యానికి గురికావు. అలాగే వాటి పరిమాణంతో పోలిస్తే సుదీర్ఘకాలం జీవిస్తాయి. కొత్తగా రూపొందించిన ఈ పూర్తిస్థాయి క్రోమోజోమ్ మ్యాపింగ్ ద్వారా గబ్బిలాల్లో ఉన్న రోగనిరోధక శక్తి, క్యాన్సర్ నిరోధక జన్యువులు, వృద్ధాప్యాన్ని అడ్డుకునే కణ వ్యవస్థలపై లోతైన పరిశోధనలకు బాటలు పడింది. ఇది భవిష్యత్తులో మానవ వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement