నింగిలోకి గూగుల్‌ ఏఐ డేటా సెంటర్లు | Google's Project Suncatcher: Why Next AI Data Center Wave Launching into Space? | Sakshi
Sakshi News home page

నింగిలోకి గూగుల్‌ ఏఐ డేటా సెంటర్లు

Sep 25 2026 9:44 AM | Updated on Sep 25 2026 10:51 AM

Google's Project Suncatcher: Why Next AI Data Center Wave Launching into Space?

కృత్రిమ మేధ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రాసెసింగ్ పవర్‌, నిరంతర విద్యుత్ అవసరాలకు అంతరిక్షమే వేదికగా మారబోతోంది. భూమిపై డేటా సెంటర్ల నిర్వహణకు అవుతున్న భారీ విద్యుత్ ఖర్చు, పర్యావరణ భారానికి ప్రత్యామ్నాయంగా గూగుల్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ (Project Suncatcher) మిషన్‌ను ప్రారంభించింది. అంతరిక్షంలో ఏఐ చిప్‌ల పనితీరును పరీక్షించడానికి రూపొందించిన మొదటి ప్రయోగాత్మక శాటిలైట్‌ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు గూగుల్ సర్వం సిద్ధం చేసింది.

మిషన్ ప్రధాన ముఖ్యాంశాలు

ప్లానెట్ ల్యాబ్స్‌తో కలిసి రూపొందించిన ‘ఎంవీపీ’ ప్రొటోటైప్ శాటిలైట్‌లో గూగుల్ తమ స్వదేశీ ‘టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లు’(ట్రిలియన్‌ టీపీయూ) 4 చిప్‌లను అమర్చింది. ఇవి భూకక్ష్యలో జెమిని ఏఐ మోడల్‌కు సంబంధించిన స్మాల్‌ మోడల్‌ క్వెరీలను ప్రాసెస్ చేస్తాయి. భూమితో పోలిస్తే అంతరిక్షంలో నిరంతర సూర్యకాంతి అందుబాటులో ఉండటం వల్ల ఎనిమిది రెట్లు అధికంగా సోలార్ పవర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇది ఏఐ మోడళ్లకు కావలసిన నిరంతర శక్తిని అందిస్తుంది.

సాంకేతిక సవాళ్లు.. పరిష్కారాలు

విశ్వంలో ఉండే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, రేడియేషన్ వల్ల చిప్‌లలో ‘బిట్ ఫ్లిప్స్’ (డేటా పొరపాట్లు) జరగకుండా యూసీ డేవిస్ ల్యాబ్‌లో రేడియేషన్ పరీక్షలు పూర్తి చేసి ఐదేళ్లపాటు అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించారు. గాలి లేని అంతరిక్షంలో వేడిని తగ్గించడానికి ఫ్యాన్లకు బదులుగా అల్యూమినియం, రాగి పూతలతో ప్రత్యేక రేడియేటర్ ప్యానెల్ సాంకేతికతను తయారు చేశారు.

భవిష్యత్తు ప్రణాళికలు

ఈ మొదటి ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి మరిన్ని ఉపగ్రహాలను పంపి అధిక బ్యాండ్‌విడ్త్ లేజర్ల ద్వారా ఒకదానికొకటి అనుసంధానించాలని గూగుల్ భావిస్తోంది. తద్వారా నింగిలోనే పూర్తిస్థాయి ‘ఆర్బిటల్ ఏఐ డేటా సెంటర్లు’ రూపుదిద్దుకోనున్నాయి. సాంకేతిక దిగ్గజాలు అంతరిక్షాన్ని తదుపరి డిజిటల్ సోర్స్‌గా మలుచుకుంటున్న తీరుకు ఈ ప్రయోగం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement