నకిలీ పన్నీర్‌కు చెక్‌ | Analogue Paneer Ban FSSAI Proposes New Rules for Non Dairy Products | Sakshi
Sakshi News home page

నకిలీ పన్నీర్‌కు చెక్‌

Sep 25 2026 9:17 AM | Updated on Sep 25 2026 10:55 AM

Analogue Paneer Ban FSSAI Proposes New Rules for Non Dairy Products

వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మరో కీలక అడుగు వేసింది. పాలు, పాల పదార్థాలతో కాకుండా వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్‌లతో తయారుచేసే అనలాగ్ పన్నీర్ ఉత్పత్తి, విక్రయాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

‘పన్నీర్’ పేరు వాడితే చర్యలు!

పాలు, పాల పదార్థాలతో కాకుండా తయారుచేసే కృత్రిమ ఉత్పత్తులకు ఇకపై ‘పన్నీర్’ అనే పేరును ఉపయోగించకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించింది. ‘అనలాగ్ ఇన్ డెయిరీ కాంటెక్స్ట్’ కింద లైసెన్సులు పొందిన సంస్థలు తమ ఉత్పత్తుల లేబుళ్లు, మార్కెటింగ్ ప్రచారాల్లో ‘పన్నీర్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి. ఆహార భద్రత ప్రామాణిక (అమ్మకాల నిషేధ, పరిమితులు) సవరణ నిబంధనలు-2026 ముసాయిదాపై వాటాదారులు, ప్రజాభిప్రాయాల సేకరణకు 60 రోజుల వ్యవధి కేటాయించారు.

క్షేత్రస్థాయి పరిస్థితి.. నిషేధాలు

మార్కెట్లలోనూ, హోటళ్లలోనూ పాలతో చేసిన అసలైన పన్నీర్‌కు బదులుగా పామాయిల్, వృక్ష సంబంధిత కొవ్వులు, రసాయనాలతో తయారుచేసిన అనలాగ్ ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది తక్కువ ధరకు లభించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇది వినియోగదారులను మోసం చేయడమే కాకుండా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ పన్నీర్ విక్రయాలపై నిషేధం విధించగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తమ ప్లాట్‌ఫామ్‌లో అనలాగ్ డెయిరీ పదార్థాలను వాడే రెస్టారెంట్లను తొలగిస్తామని ప్రకటించింది. కేంద్ర నియంత్రణ సంస్థ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో నిజమైన పాల ఉత్పత్తిదారులు, డెయిరీ రైతులకు మేలు జరగనుంది.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement