అనలాగ్‌ పన్నీరు.. తింటే కన్నీరే.. | Fake paneer in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అనలాగ్‌ పన్నీరు.. తింటే కన్నీరే..

Sep 20 2026 5:18 AM | Updated on Sep 20 2026 5:18 AM

Fake paneer in Andhra Pradesh

మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ పన్నీర్‌

అనలాగ్‌ పన్నీర్‌ను పాలతో తయారు చేసిన పన్నీర్‌గా అమ్మేస్తున్న కేటుగాళ్లు 

అసలు పాల చుక్క లేకుండా రసాయనాలు, నూనెలతో అనలాగ్‌ పన్నీర్‌ తయారీ 

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తెచ్చి రీప్యాకింగ్‌ 

తక్కువ ధర కావడంతో విచ్చలవిడిగా వాడేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు 

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి 

ఈ పన్నీరు తింటే రోగాలు వస్తాయంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: పాలు చుక్క కూడా ఉండవు.. కానీ, పన్నీర్‌ తయారైపోతుంది. పూర్తిగా రసాయనాలు, నూనెలే ఉంటాయి అందులో. అది తింటే రోగాలే. ఇప్పుడు విజయవాడ నగరంలో ఈ నకిలీ అనలాగ్‌ పన్నీరు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. చూడటానికి పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన పన్నీరులా కనిపించే ఈ నకిలీ పన్నీర్‌తో రాష్ట్ర మా­ర్కె­ట్‌ను కేటుగాళ్లు ముంచెత్తుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నుంచి పెద్ద మొత్తంలో అన­లాగ్‌ పన్నీర్‌ను తెచ్చి విజయవాడ కేంద్రంగా రీ–­ప్యాకింగ్‌ చేసి పాలతో తయారు చేసిన పన్నీర్‌గా హోటళ్లు, రెస్టారెంట్‌లు, వినియోగదారులకు అంటగ­డుతున్నారు. శుక్రవారం విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని శ్రీ కనకదుర్గ డెయిరీ, గిరిపురంలో దేవరపల్లి కిశోర్‌ ఇంట్లో అనలాగ్‌ పన్నీర్‌ను పాలతో తయారు చేసిన పన్నీర్‌గా రీ ప్యాకింగ్‌ చేస్తున్నట్టు గుర్తించి, కేసులు నమోదు చేశారు.  

ఏమిటీ అనలాగ్‌ పన్నీర్‌? 
వాస్తవానికి ఆవు లేదా గేదె పాలను విరగ్గొట్టి పన్నీరు తయారు చేస్తారు. ఇది అసలైన పన్నీరు. అనలాగ్‌ పన్నీర్‌ అనేది పాలు లేకుండా పూర్తిగా కృత్రిమంగా తయారు చేస్తారు. పామాయిల్, వెజిటబుల్‌ ఆయిల్స్‌ (వంట నూనెలు), స్టార్చ్, సోయా ప్రోటీన్, సిట్రిక్‌ యాసిడ్, కృత్రిమ సువాసనలు, ప్రిజర్వేటివ్స్‌ను నీటిలో కలిపి అనలాగ్‌ పన్నీర్‌ను తయారు చేస్తారు. హైదరాబాద్‌లో అనలాగ్‌ పన్నీర్‌ తయారీ యూనిట్ల నుంచి 5 కిలోల ప్యాకెట్లను కేటుగాళ్లు ఏపీలోకి తెస్తున్నారు.

వీటిని పాలతో తయారు చేసిన పన్నీర్‌ తరహాలో 250 గ్రాములు, అర కిలో, కిలో ప్యాకెట్‌లుగా రీప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. విజయవాడలో పేరుమోసిన అనేక రెస్టారెంట్‌లు, హోటళ్లు గత కొన్నేళ్లుగా అనలాగ్‌ పన్నీర్‌నే కొని, ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రొటీన్, కాల్షియం, ఇతర పోషకాల కోసం ఆహారప్రియులు పన్నీర్‌ను ఆహారంలో తీసుకుంటూ ఉంటారు.

నూనెలతో కృత్రిమంగా తయా­రు చేసిన అనలాగ్‌ పన్నీర్‌లో అసలు ప్రొటీన్‌ అనేది ఉండదని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. పాలతో తయారు చేసిన పన్నీర్‌ను ప్రముఖ డెయి­రీలు కేజీ రూ.500, ఆపైన ధరలతో అమ్ముతుండగా, అనలాగ్‌ పన్నీర్‌ కిలో రూ.250కే లభిస్తోంది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్‌లలో చవకైనా, అనారోగ్య కారకమైన అనలాగ్‌ పన్నీర్‌తోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 
అనలాగ్‌ నకిలీ పన్నీర్‌ను నిత్యం వినియోగి­స్తే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే­నని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పామాయి­ల్, రసాయనాలతో శరీరంలో చెడు కొలెస్ట్రా­ల్‌ పెరిగి గుండె జబ్బుల ముప్పు పెరుగు­తుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, అజీర్ణం, కాలేయ సమస్యలు, స్థూలకాయం(బరువు పెరగడం) వంటి అనర్థాలు చుట్టుముడతా­యి. అనలాగ్‌ పన్నీర్‌ విక్ర­యాలు, తయారీ, వినియోగాన్ని దేశంలో ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు నిషేధించాయి. ఏపీలో విచ్చలవిడిగా అనలాగ్‌ పన్నీర్‌ లభి­స్తూ ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిషేధం విధించడంపై మీనమేషాలు లెక్కిస్తోంది.

తేడా తెలుసుకోవచ్చిలా
పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన పన్నీర్‌ స్పాంజ్‌లాగా మెత్తగా ఉంటుంది. దీనిని వేడి కూ­రల్లో వేసినప్పుడు, వేడి చేసినప్పుడు మెత్తగా మారు­తుంది కానీ కరిగిపోదు. అదే అనలాగ్‌ పన్నీర్‌లో వాడే నూనెలు, స్టార్చ్‌ కారణంగా ఇది వేడి తగిలితే త్వరగా కరిగిపోతుంది. లేదంటే సాగుతుంది.

⇒  వంటింటి చిట్కాల ద్వారా కూడా నకిలీ పన్నీర్‌ను కనిపెట్టవచ్చు. కొద్దిగా పన్నీర్‌ ముక్కను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని చల్లార్చాక రెండు చుక్కల ఉప్పు ద్రావ­ణం (అయోడిన్‌ టింక్చర్‌) వేయాలి. అప్పుడు అది నీలం లేదా నలుపు రంగులోకి మారితే అది అనలాగ్‌ పన్నీరే. 
⇒  స్వచ్ఛమైన పన్నీర్‌ను చేతితో నలిపితే సులభంగా పొడిపొడిగా లేదా చిన్న ము­క్కలుగా విడిపోతుంది. కానీ నకిలీ పన్నీర్‌లో రసాయనాలు, గమ్‌/ఎమల్సి­ఫైయర్లు ఉండటంతో అది రబ్బ­రులా సాగుతుంది. అంత తేలికగా విడిపోదు.

⇒  చిన్న పన్నీర్‌ ముక్కను అగ్గిపుల్లతో వెలిగిస్తే, అసలైన పన్నీర్‌ కాలి బూడిద అవుతుంది. అనలాగ్‌ పన్నీర్‌లో నూనెలు ఉండటంతో అది కొవ్వులా కరిగి, నురగ వస్తుంది. 
⇒  స్వచ్ఛమైన పన్నీర్‌ తింటున్నప్పుడు తేలికపాటి పాల సువాసన, తియ్యటి రుచి వస్తాయి. నకిలీ పన్నీర్‌ వాసన ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement