సత్యప్రసాద్ మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని 2024 ఆగస్టు 18న మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వై.ప్రభాకర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్
డైవర్షన్ కోసం చంద్రబాబు కొత్త డ్రామా
డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుని దొరికిపోయిన దొంగల కుట్ర ఇది
డీఎస్సీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం
ఓ సాధారణ ఉద్యోగి సీఎంను కలవడం సాధ్యమా?
సత్యప్రసాద్ సీఎంను దగ్గర నుంచైనా చూసి ఉంటాడా?
రేపు ఓ హోంగార్డును తెచ్చి సీఎంపై ఆరోపణలు చేయిస్తే చెల్లుతుందా?
విజయవాడ సీపీతో సత్యప్రసాద్ సంబంధాల వెనక మర్మమేమిటి?
ఆస్తులు అమ్మించి.. అన్నీ తాము చూసుకుంటామని భరోసా దేనికి..?
మానసిక వైకల్యానికి చికిత్స తీసుకుంటున్న సత్యప్రసాద్ సాక్ష్యం చెల్లుతుందా?
ఆది నుంచీ వేధింపులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులే సిట్ ఆయుధాలు
బాబుకు అవసరమైనప్పుడు.. ఆయన చెప్పినట్టు అబద్ధపు సాక్ష్యాలు
సుప్రీంకోర్టు తలంటినా సిట్ తీరులో కానరాని మార్పు
హైకోర్టు, ఏసీబీ కోర్టుతోనూ చివాట్లు
అసలు మద్యం దోపిడీ జరిగింది 2014–19 మధ్య బాబు హయాంలో..
మళ్లీ ఇప్పుడు మద్యం మాఫియా చెలరేగిపోతోంది.. అధికరేట్లు.. పర్మిట్ రూమ్‌లు.. ఆక్షన్ లేకుండా కేటాయింపులు
ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలన్నీ చంద్రబాబు డైరెక్షన్‌లోనే
వీటి నుంచి డైవర్ట్ చేయడానికే సిట్ కట్టుకథలు..
సాక్షి, అమరావతి: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ స్టోరీలు సీజన్‌లవారీగా విడుదలైనట్లు నారావారి భేతాళ కుట్ర కేసులో నాలుగో సీజన్ మొదలయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మద్యం అక్రమ కేసు నాటకాన్ని నానా ప్రయాసలు పడి రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తోంది. అయినా అతకని కథలు, పొసగని పాత్రల వల్ల ఈ కుట్రల నాటకం రసాభాస అవుతోంది. కుట్రలు, బెదిరింపులు, ప్రలోభాలతో సాగుతున్న దర్యాప్తు తీరును ప్రజలు గమనిస్తున్నారు. రెండేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా అధోగతి పాలయ్యింది. ప్రజా సమస్యల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి, డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సిట్ చేత మళ్లీ భేతాళ కుట్ర కేసులో కొత్త కథలు మొదలుపెట్టారు. తాము చెప్పిన వారికి వ్యతిరేకంగా, తమకు కావలసిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వని వారిని రకరకాల మార్గాల్లో తమ దార్లోకి తెచ్చుకోవడం, వారి చేత బలవంతంగా కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించడం జనం చూస్తున్నారు. అలా తమ దార్లోకి తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) అప్పటి ప్రత్యేకాధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను ఈ సీజన్‌లో రంగంలోకి దింపారు. అక్రమ మద్యం కేసులో సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు శుక్రవారం తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. సిట్ ముందే సిద్ధం చేసి ఇచ్చిన స్క్రిప్‌్టలోని తప్పుడు వివరాలనే సత్యప్రసాద్ కోర్టు ముందు వల్లెవేశారు. రెండున్నర ఏళ్లుగా ఈ కేసులో ఏమీ కనుక్కోలేకపోయారంటూ సిట్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. సిట్ అతి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ముందు సిట్ తీరును తేలుస్తామంది. దీనిని బట్టే సిట్ దర్యాప్తులో ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత నిష్పాక్షికత, పారదర్శకత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అసలు సీఎంను చూసి ఉంటాడా..?
సత్యప్రసాద్ అనే వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్‌లో ఏ స్థాయి ఉద్యోగి. అసలు అతను తన జీవితకాలంలో ముఖ్యమంత్రిని కలవడం మాట అలా ఉంచి దగ్గరగా చూసి ఉంటాడా? ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిని ఈ స్థాయి ఉద్యోగి చూడడమే గగనం. అలాంటిది ముఖ్యమంత్రి నివాసంలో, ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు అబద్ధాలు చెప్పించడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. రేపు ఓ హోంగార్డును తీసుకొచ్చి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయిస్తే చెల్లుబాటు అవుతుందా.. అని జనం చర్చించుకుంటున్నారు.. సీఎంను కలిసే అవకాశమే లేని సాధారణ ఉద్యోగిచేత ఇలాంటి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తే చెల్లుబాటు అవుతుందా? కనీస ఇంగితజ్ఞానం ఉన్నవారెవరూ ఇలాంటి దిగజారుడు కుట్రలకు దిగరు..
సీపీతో సన్నిహిత సంబంధాల వెనుక
విజయవాడ సీపీతో సత్యప్రసాద్ సన్నిహిత సంబంధాలు బహిరంగ రహస్యమే. అప్రూవర్ వేషం వేయించి అబద్ధాలు చెప్పించే పనిని ప్రభుత్వ పెద్దలు సీపీకి అప్పగించినట్లు పోలీసు వర్గాలలో వినిపిస్తోంది. సత్యప్రసాద్ ఆస్తులలో సింహభాగం సీపీ దగ్గరుండి అమ్మించినట్లు సమాచారం. మిగిలిన ఆస్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంలో పై స్థాయిలో మాట్లాడి సరిచేసేందుకు కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా సత్యప్రసాద్‌కు ముందే సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇచ్చి బాగా తర్ఫీదు ఇచ్చి మరీ కావలసిన విధంగా వాంగ్మూలం ఇప్పించినట్లు న్యాయవర్గాలలో వినిపిస్తోంది.
ఇప్పుడు సిట్ చెప్పింది కాబట్టే ..?
సత్యప్రసాద్ నుంచి సిట్ మొదట ఫిబ్రవరి 21, 2025న వాంగ్మూలం తీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 25న మెజి్రస్టేట్ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అటు తరువాత జులై 16న మరొక వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా శుక్రవారం మరోసారి వాంగ్మూలం ఇచ్చారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలాల్లో సత్యప్రసాద్ ఎన్నడూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు సిట్ ఒత్తిడితోనే జగన్ పేరును సత్యప్రసాద్ చెప్పారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
వేధింపులు.. బెదిరింపులతోనే సిట్ దర్యాప్తు..
మద్యం అక్రమ కేసులో సిట్ తొలి రోజు నుంచి కూడా తన రాజకీయ బాసులను సంతృప్తిపరిచే దిశగానే దర్యాప్తు చేస్తూ వస్తోంది. వైఎస్సార్‌సీపీ కీలకనేతలే లక్ష్యంగా అరెస్ట్‌లు మొదలుపెట్టింది. పలువురిని బెదిరించింది. నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేసింది. రాత్రీ పగలు ఫోన్లు చేస్తూ బూతులు తిడుతూ నరకం చూపించారు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులకు, వారి బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి చెప్పినట్లు విని తమకు కావాల్సిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్ బెదిరింపులకు దిగింది. ఇళ్లల్లోని మహిళలు, వృద్ధులు, నిందితుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల పట్ల సిట్ అమానవీయంగా వ్యవహరించింది. వయోభారంతో ఉన్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా సిట్ విడిచిపెట్టలేదు. చెప్పినట్లు వినేందుకు నిరాకరించిన కొందరిపై సిట్ అధికారులు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో సిట్ వేధింపులు పడలేక వారు హైకోర్టును ఆశ్రయించి తమ బాధను మొరపెట్టుకున్నారు. దీంతో హైకోర్టు సిట్ వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తూ పలు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకూ 57 మంది వ్యక్తులను, ఆయా సంస్థలను ఇరికించారు. దాదాపు 17 మందిని అరెస్టు చేశారు. మద్యం రవాణాలో అక్రమాలంటూ మరో కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు.
పోలీసు అధికారినే కిడ్నాప్ చేసిన సిట్
సిట్ అధికారులు ఎంతకు బరి తెగించారంటే, వారు ఏకంగా కిడ్నాపర్ల అవతారం కూడా ఎత్తారు. తిరుపతికి చెందిన విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డిని కిడ్నాప్ చేశారు. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆయన్ని చిత్ర హింసలకు గురిచేశారు. తన కొడుకు ఆచూకీ చెప్పాలని నానా ఇబ్బందులు పెట్టారు. 60 ఏళ్ల పైబడ్డ వ్యక్తులను వారి ఇంటి వద్దే విచారించాలని చట్ట నిబంధనలు చెబుతుంటే, వాటిని కాలరాస్తూ ఇష్టారీతిన సిట్ అధికారులు వ్యవహరించారు. మద్యం డిస్టిలరీలకు సంబంధించిన వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి బంధువులను ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేసి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. కొందరు వీరికి భయపడి వారు చెప్పినట్లు చేయగా, మరికొందరు మాత్రం సిట్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశారు.
సిట్ చెప్పినట్లు చేశారనే ప్రమోషన్
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గర పనిచేస్తున్న ఇద్దరు గన్‌మెన్లను సిట్ బెదిరించి వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. సిట్ మాట విన్న గిరిబాబు అనే కానిస్టేబుల్‌కు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పదోన్నతినిచ్చింది. ఒకేసారి రూ. 60వేల జీతం పెంచింది. గత జీతంతో పోలిస్తే ఇది 55 శాతం అధికం. ఈ కేసులో సిట్ ఏ రకంగా వాంగ్మూలాలను ఇప్పించిందో తెలియచేయడానికి ఈ ఘటన ఒక్కటి చాలు.
సిట్‌కు ఎదురు తిరిగినందుకు థర్డ్‌డిగ్రీ...
చెవిరెడ్డి దగ్గర పనిచేస్తున్న మదన్ మోహన్‌రెడ్డి అనే మరొక కానిస్టేబుల్, సిట్ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగలేదు. సిట్ కోరినట్లు ఎవరికీ వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు. దీంతో సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని అతనిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. అలాగే ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. దీంతో ఆయన సిట్ అరాచకాలపై హైకోర్టును ఆశ్రయించారు.
తప్పుడు వాంగ్మూలానికి సిట్ రెండు కోట్లు ఆఫర్...
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి రూ. 2 కోట్లను ఆశ చూపించి, తాము కోరిన విధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఒప్పుకోనందుకు వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి అరెస్టు చేశారు. సిట్ దౌర్జన్యాన్ని, డబ్బు ఇవ్వబోయిన విషయాన్ని ఆయన కోర్టుకే నివేదించారు.
నిందితుల ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతో కుట్రలు...
నిందితుల దగ్గర నుంచి స్వా«దీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తదితర ఉపకరణాలను సిట్ అధికారులు అటు కోర్టుకు గానీ, ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు గానీ పంపలేదు. నిబంధనలకు విరుద్ధంగా వారు వాటిని తమ వద్దే ఉంచుకున్నారు. అప్పటికే కొనుగోలు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా తమకు కావాల్సిన విధంగా సమాచారాన్ని ఆ ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లలోకి చొప్పించి, తప్పుడు సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేశారు. చివరకు న్యాయస్థానం నిలదీయడంతో వాటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఇది కోర్టుతో బేరసారాలాడడమే..
వాస్తవానికి మద్యం అక్రమ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సైతం సిట్ అప్రూవర్‌గా మార్చేందుకు ప్రయత్నించింది. ముందస్తు బెయిల్‌కు సహకరిస్తామని ప్రలోభాలకు గురి చేసింది. అంతేకాక అతనితో పాటు సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టులో బలవంతంగా పిటిషన్ దాఖలు చేయించి, అప్రూవర్‌గా మారతామని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరేలా చేసింది. అయితే ఏసీబీ కోర్టు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ల పిటిషన్‌ను కొట్టేసింది. అప్రూవర్‌గా మారుతాం కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంపై అభ్యంతరం తెలిపింది. ఇది కోర్టుతో బేరసారాలు అడటమేనంటూ తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి పెండింగ్‌లో ఉండగా, వాసుదేవరెడ్డికి సిట్ తత్వం బోధపడింది. తనను పావుగా వాడుకుంటున్నారని గ్రహించారు. అంతర్గతంగా సిట్‌కు ఆయన అడ్డం తిరిగారు. దీంతో సిట్ వెంటనే తన ప్రతాపాన్ని చూపింది. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింది. అంతేకాక మద్యం రవాణాలో అక్రమాలంటూ మరో కేసు నమోదు చేసి, అందులో కూడా వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చింది.
ప్రైవేటు వ్యక్తుల డబ్బు దొరికితే.. లిక్కర్ డబ్బేనన్న సిట్...
గత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో దాచేపల్లి చెక్ పోస్టు వద్ద డబ్బు దొరికితే, ఆ డబ్బు తన వ్యక్తిగతమని, దానికి లెక్కలు ఉన్నాయని సదరు డబ్బు యజమాని చెప్పారు. అయితే సిట్ అధికారులు అతన్ని కూడా బెదిరించి ఆ డబ్బు మద్యం కేసు తాలుకు డబ్బుగా చెప్పారు. దీంతో ఆ వ్యక్తి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు సిట్ తీరును ఆక్షేపించింది. చివరకు మద్యం కేసుతో సంబంధం లేని వ్యక్తుల ఆస్తులను కూడా జప్తు చేసి, వాటిని కూడా మద్యం కేసుతో ముడిపెట్టారు.
సిట్‌కు తలంటిన సుప్రీంకోర్టు
సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టులు పలు సందర్భాలలో తీవ్రంగా ఆక్షేపించాయి. సిట్ రెండేళ్లుగా ఏం చేసిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమీ కనుగొనలేకపోయిందని తేల్చి చెప్పింది. ఈ కేసులో సిట్ అనుసరిస్తున్న పక్షపాత, చట్ట విరుద్ధ తీరును తప్పు పట్టింది. సిట్ తీరు ఆందోళన కలిగిస్తోందని, అతి చేస్తోందని తెలిపింది. ఈ కేసులో తాము ముందు సిట్ తీరు తేలుస్తామని, ప్రవర్తనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాతే హైకోర్టు ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది. సిట్ తీరు కచ్చితంగా ఆక్షేపణీయమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఏసీబీ కోర్టులోనూ సిట్‌కు శృంగభంగం
సిట్ కుట్రలు ఒక్కటొక్కటిగా విఫలమవుతుండడంతో డబ్బు కట్టల డ్రామా ఆడారు. హైదరాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఒక ఫాంహౌసులో సిట్ అధికారులు 11 కోట్ల రూపాయల నోట్లకట్టలను అట్టపెట్టల్లో అక్కడి పెట్టించారు. అనంతరం తమ తనిఖీల్లో ఆ డబ్బు బయటపడిందని, ఇదంతా లిక్కర్ డబ్బేనంటూ కట్టు కథ అల్లారు. విజయవాడ ఏసీబీ కోర్టు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని సిట్‌ను ఆదేశించింది. డబ్బును జాగ్రత్తగా బ్యాంకులో ఉంచాలని కూడా ఆదేశించింది. అయితే సిట్ ఇక్కడే కోర్టుకు అడ్డంగా దొరికిపోయింది. డబ్బును భద్రపరిచిన తాలుకు రసీదును చూపాలని కోర్టు సిట్ అధికారులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు కోర్టు నుంచే పారిపోయారు. సాయంత్రం వరకు కోర్టువైపు కూడా రాలేదు. హడావుడిగా బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి, వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, భద్రపరచమన్న డబ్బును బ్యాంకు నగదులో కలిపేశామని చెప్పించారు. దీంతో సిట్ కుట్ర బహిర్గతం అయింది.
మానసిక సమస్యలతో సత్యప్రసాద్
మానసిక సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్, అందుకు చికిత్స పొందుతూ పలు మందులు కూడా వాడుతున్నారని ఆయనతో కలసి పనిచేసిన కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. పదేళ్లుగా మానసిక రోగంతో బాధపడుతూ అనంతపురంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సత్యప్రసాద్ మానసికవైకల్యానికి చికిత్స పొందుతున్నట్లుగా మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. అలాంటి మానసిక రోగి వాంగ్మూలాన్ని సిట్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? ఈ వాంగ్మూలానికి కోర్టులో విలువేముంటుంది?
సత్యప్రసాద్ సహకరించారు.. బెయిల్ ఇచ్చేయండి...
సత్యప్రసాద్ తమకు అన్ని విధాలా సహకరించారని హైకోర్టుకు సిట్ చెప్పింది. తమకు కావాల్సిన విధంగా వ్యవహరించారని తెలిపింది. తమకు కావాల్సిన రీతిలో వాంగ్మూలాలు కూడా ఇచ్చారంది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేయాలనుకోవడం లేదని కోర్టుకు చెప్పింది. సత్యప్రసాద్ తరఫు న్యాయవాది కూడా సిట్ కోరినట్లుగానే అన్నీ చెప్పారని వివరించారు. దాంతో హైకోర్టు, సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. చెప్పినట్లుగానే తనకు ముందస్తు బెయిల్ ఇప్పించడంతో సత్యప్రసాద్ పూర్తిగా సిట్ చేతుల్లోకి వెళ్లిపోయారు. దీంతో సిట్ ఆయనను అప్రూవర్‌గా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా సిట్ ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసి దాన్ని ఆయనకు ఇచ్చింది. కోర్టుకిచ్చే వాంగ్మూలంలో ఎవరెవరి గురించి చెప్పాలి.. ఎలా చెప్పాలి.. తదితర వివరాలన్నింటినీ సిట్ ముందే సత్యప్రసాద్‌కు దగ్గరుండి చెప్పింది. దీంతో సత్యప్రసాద్ సిట్ చెప్పినట్లే కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
2014–19 మధ్య జరిగిందే దోపిడీ... ఇప్పుడు ఇంకా నాలుగురెట్లు దోపిడీయే లక్ష్యం..
2014–19 మధ్య బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలుగా లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా రెండు చీకటి జీవోలపై సంతకాలు చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ. 1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ. 5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని కాగ్ రిపోర్టులో ఆధారాలతో సహా నివేదించింది. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్‌రూములు, 43వేల బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారించారు. ఎమ్మార్పీకంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టారు.చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బైటపడడంతో 2023లో సీఐడీ కేసు నమోదు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మద్యం మాఫియాకు తలుపులు బార్లా తెరిచింది. జగన్ హయాంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను తీసుకువచ్చింది. రాష్ట్రంలోని 4,336 మద్యం దుకాణాలను ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. బార్లను కూడా టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది. దాదాపు 75వేల అనధికార బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పరోక్ష సహకారం అందించింది. మద్యం ఏరులై పారిస్తోంది. 2014–19నాటి మద్యం దోపిడీకి మించి మహాదోపిడీకి తెగబడుతోంది. ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఎమ్మార్పీ కంటే 20శాతం అధిక ధరలతో 2014–19లో రూ.25వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. 2024–29లో అంతకు నాలుగురెట్లు.. అంటే రూ.లక్ష కోట్ల దోపిడీకి తెరతీశారు. అందుకోసం లాభాల మార్జిన్ 9 నుంచి 14 శాతానికి పెంచేశారు.., ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాల ద్వారా దోచుకుంటున్నారు. ఆక్షన్ లేకుండా షాపులు రెన్యువల్ చేసేస్తున్నారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీయేనంటే వీళ్ల లాభాల కక్కుర్తి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
అన్ని మాఫియాలు నడిపేది చంద్రబాబే..
రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్æ, లేటరైట్ అన్నీ మాఫియానే. అన్నీ చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడుస్తున్నాయి. ఆయన అనుయాయులు, బినామీలే వీటిని నడుపుతున్నారు.మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్‌లు ఎస్‌ఎఫ్‌టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్ షాపుల పేరిట నకిలీ లిక్కర్. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. 
చెలరేగిపోతున్న డ్రగ్స్, గంజాయి మాఫియా
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్‌గా మారింది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం దందాను పర్యవేక్షిస్తున్నాయి. పోలీసులేమీ తక్కువ తినలేదు. ఈ మాఫియాలో వారూ తమ వంతుపాత్ర వారు పోషిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు కారులో గంజాయి, మద్యం రవాణా చేస్తూ యాక్సిడెంట్ చేసి దొరికిపోవడం చూస్తే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్ధమౌతుంది.


