అమాంతం క్వింటాకు రూ.2 వేలు బాదుడు
మిల్లర్లు.. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్మక్కు..
కరువు పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పెంపు
నియంత్రణ వ్యవస్థను గాలికొదిలేసి సర్కారు చోద్యం
ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల
సన్నరకాలే కాకుండా ముతక బియ్యం ధరలు సైతం పైపైకి
ఈ ఏడాది బియ్యం మిల్లర్ల వద్దే పెట్టుకుని దందా
ఇప్పుడు విక్రయిస్తున్న బియ్యం రకాలన్నీ గతేడాదివే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ సామాన్య ప్రజలను గాలికొదిలేసింది. మామూళ్ల మత్తులో నియంత్రణ వ్యవస్థలను గాలికొదిలేయడంతో మిల్లర్లు, వ్యాపారులు ఎడాపెడా ధరలు పెంచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం మూడు నాలుగు నెలల్లోనే క్వింటాకు రూ.2 వేల వరకు పెంచేశారు. సన్న రకాలే కాదు.. ముతక బియ్యం ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో బ్రాండ్ ఏదైనా సరే బియ్యం ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.
బ్రాండ్ ఏదైనా కిలో రూ.70
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా 5–6 లక్షల టన్నుల బియ్యం వినియోగం ఉంది. రెండు పూటలా బియ్యం తినే నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు కనీసం 40 కిలోల వరకు బియ్యం పడతాయని అంచనా. రేషన్ బియ్యం వినియోగం మినహాయించినా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సగటున 3–4 లక్షల టన్నుల బియ్యం కొనుగోళ్లు చేస్తుంటారు. బ్రాండ్ ఏదైనా మార్కెట్‌లోకి బీపీటీ, హెచ్‌ఎంటీ ఆర్‌ఎన్‌ఆర్, రా రైస్ రకాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో బీపీటీ రకాల కంటే హెచ్‌ఎంటీ రకాల ధరలు కిలోకు రూ.7–10 వరకు అధికంగా ఉండేవి.
అలాంటిది ఉత్పత్తి తగ్గిపోయాయనే సాకుతో బీపీటీ రకాల ధరలను భారీగా పెంచడంతో బీపీటీ – హెచ్‌ఎంటీ రకాల మధ్య వ్యత్యాసం కిలోకు రూ. 3–4 మధ్యకు చేరింది. మార్కెట్‌లో లలిత, డైమండ్, శ్రీశీ, బృందావన్, 666, రైతుమిత్ర, బుల్, గోపిక, మహిత, బెల్, ఐశ్వర్య.. ఇలా ఏ బ్రాండ్ బియ్యం ధరలు చూసినా కిలో రూ.65–70కి తక్కువ పలకడం లేదు.
మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే బ్రాండెడ్ సన్న బియ్యం మేలో కిలో రూ.54–56 మధ్య ఉండగా, ప్రస్తుతం గరిష్టంగా రూ.72కు చేరింది. చివరకు హెచ్‌ఎంటీ మసర్ (రంగు మారిన బియ్యం) ధర కూడా కిలో రూ.46 నుంచి రూ.56కు చేరిందంటే ఏ స్థాయిలో బియ్యం ధరలు పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదని వ్యాపారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కరువు సాకుతో ధరలు పెంచేస్తున్న మిల్లర్లు
సాధారణంగా ఏటా సాగైన పంటకు చెందిన బియ్యం ఉత్పత్తులు నవంబర్ నుంచి మార్కెట్‌కు వస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బియ్యం నిల్వలన్నీ గతేడాది పండిన పంటకు సంబం«ధించినవే. గతేడాది ఖరీఫ్‌తో పాటు రబీలోనూ రికార్డు స్థాయిలోనే వరి సాగైందని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో సన్నరకాల నిల్వలకు ఢోకా లేదు. రైసు మిల్లర్ల వద్ద భారీ ఎత్తునే సన్నరకాల నిల్వలున్నాయి. అయినా సరే ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న కరువును సాకుగా చూపిస్తూ మిల్లర్లు ఇష్టానుసారంగా బియ్యం ధరలను పెంచేస్తున్నారు. మేలో బీపీటీ రకాలు క్వింటా రూ.4 వేల నుంచి రూ.4,200, హెచ్‌ఎంటీ ఆర్‌ఎన్‌ఆర్ రకాలు రూ.4,500 నుంచి రూ.4,800, రా రైస్ రూ.5,300 వరకు ఉండేవి.
అలాంటిది నాలుగు నెలల్లో క్వింటాకు రూ.2 వేల వరకు పెంచేశారు. ప్రస్తుతం బీపీటీ రకాలు రూ.6 వేల నుంచి రూ.6,100, హెచ్‌ఎంటీ ఆర్‌ఎన్‌ఆర్ రకాలు రూ.6,400 నుంచి రూ.6,500, రా రైస్ రూ.6,500 పలుకుతున్నాయి. చివరికి మసర్ (రంగు మారిన ధాన్యానికి చెందిన బియ్యం) ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బీపీటీ మసర్ రకాలు రూ.3,500 నుంచి రూ.3,900కు పెరగగా, హెచ్‌ఎంటీ మసర్ బియ్యం క్వింటా రూ.4,200 నుంచి రూ.5,400కు చేరింది.
బియ్యం క్వింటా మేలో రూ.4,200 ఉండగా, ప్రస్తుతం రూ.5,400కు చేరింది. అంటే గడిచిన నాలుగు నెలల్లో మిల్లర్లు బ్రాండ్‌ను బట్టి క్వింటాకు రూ.2 వేలకు పైగా పెంచేశారు. దీనికి అదనంగా లోడింగ్, అన్ లోడింగ్, బ్రోకరేజ్, హమాలీ చార్జీలతో పాటు కొంత మేర మార్జిన్ వేసుకొని స్థానికంగా బియ్యం వ్యాపారులు వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
వాస్తవానికి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నియంత్రణా వ్యవస్థ ద్వారా నిఘా పెట్టాలి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలి. ధరల పెరుగుదలకు మూలాలను అన్వేషించి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలి. కానీ రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టి నట్టయినా లేదు.
మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్ల మూటలకు తలొగ్గి నోరు మెదపడం లేదు. తనిఖీలు ఊసెత్తడంలేదు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం నిల్వలను వెలికి తీయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.52కే సన్న బియ్యం విక్రయిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప క్షేత్ర స్థాయిలో కానరావడం లేదు. రిటైల్ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ప్రచారార్భాటానికి తెగబడుతోందని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి ఖర్చులు రెట్టింపయ్యాయి
మా వారు ఏసీ మెకానిక్. మాకు ఇద్దరు పిల్లలు. ఇంటి ఖర్చులకు గతంలో నెలకు రూ.4 వేలు అయ్యేవి. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకరోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు. కానీ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. కొన్నాళ్లుగా బియ్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. పాతిక కేజీల బస్తాకు రూ.1,750 పెట్టాల్సి వస్తోంది. చాలా ఇబ్బందిగా ఉంది. – తిరుమానిగౌరి, నిడమానూరు, కృష్ణా జిల్లా
ఏం కొనాలో.. ఏం తినాలో..
మాది వ్యవసాయ కుటుంబం. పూట గడవడమే కష్టంగా ఉంది. మార్కెట్‌లో బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగి పోతున్నాయి. అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సన్న బియ్యం ధర షాక్ కొడుతోంది. పప్పులు, నూనె ధరలు చూస్తుంటే చురుక్కుమంటున్నాయి. ఏం కొనాలో.. ఏం తినాలో అర్థం కావడం లేదు. – గాజుల శ్రీనివాసరావు, ఆవులవారిపాలెం, బాపట్ల జిల్లా
ఒక పూట తింటే మరో పూట పస్తులే..
బియ్యం ధరలు చుక్కలంటుతున్నాయి. మార్కెట్‌లో పాతిక కేజీల బస్తా రూ.1,600 తక్కువ లేదు. బస్తాపై రూ.250 నుంచి రూ.500 వరకు పెరిగింది. దీంతో ఒకపూట తింటే ఒక పూట పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. – పి.నాగమల్లేశ్వరమ్మ, తూర్పుపాలెం, బాపట్ల జిల్లా
మరింత పెరిగే అవకాశం
బియ్యం ధరలు నాలుగు నెలల్లో 26 కేజీల బస్తాకు రూ.500 వరకు పెరిగాయి. కిలోకు రూ.15–20 వరకు పెరిగాయి. మరింత పెరుగుతాయంటున్నారు. మిల్లర్లను అడుగుతుంటే పంట లేదు కదా.. అని బదులిస్తున్నారు.
– బత్తుల లక్ష్మీనరసింహస్వామి, బియ్యం వ్యాపారి, విజయవాడ


