అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కలలు కంటున్న భారతీయ టెకీలకు ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో షాకిచ్చింది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై విధించిన 1 లక్ష డాలర్ల H-1B వీసా ఫీజును మరో ఏడాది పొడిగించింది. ఇప్పటికే ఈ భారీ ఫీజుతో సతమతమవుతున్న ఐటీ రంగానికి తాజా నిర్ణయం మరింత కీలకంగా మారింది. ఈ ఫీజు కారణంగా పెద్ద ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థల్లో H-1B రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గినట్లు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా H-1B కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విదేశీ ఉద్యోగులను తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు పెంచడం, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకునేలా చూడటమే లక్ష్యంగా ఫీజును కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
భారతీయులపైనే ప్రభావం?
అమెరికా H-1B వీసా కార్యక్రమంలో అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ట్రంప్ తాజా నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కొత్తగా ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అమెరికాలో ఇప్పటికే విద్యార్థి వీసాలపై ఉన్న విదేశీయులకు మంజూరయ్యే H-1B వీసాలు, ప్రస్తుత వీసాల రెన్యూవల్స్‌కు ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని గత ఆదేశంలో స్పష్టం చేశారు.
వీసా దరఖాస్తులపై మరింత నిఘా
ఫీజు పొడిగింపుతోపాటు H-1B దరఖాస్తుల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. అమెరికన్ ఉద్యోగులను తొలగించినా లేదా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో మరింత నిశితంగా పరిశీలించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. గతంలో సమర్పించిన లేబర్ కండిషన్ దరఖాస్తులపై 30 రోజుల్లో సమీక్ష ప్రారంభించాలని కార్మిక శాఖకు సూచించింది. అవసరమైతే స్పాన్సర్ సంస్థలపై తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించనున్నారు.
కోర్టులో కేసులు.. అయినా వెనక్కి తగ్గని ట్రంప్!
2025లో విధించిన లక్ష డాలర్ల ఫీజును సవాలు చేస్తూ రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, గడువు ముగియనున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగింపు ప్రకటించింది. మొత్తంగా.. H-1B వీసాలపై భారీ ఫీజు, కఠిన తనిఖీలు కొనసాగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: ఇరాన్‌లో ట్రంప్‌కు బిగ్ షాక్


