గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికాకు ‘శాశ్వత నియంత్రణ’’ లభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే దీనిని ఆయన ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా అభివర్ణించారు.
ట్రంప్ చేసిన తాజా ప్రకటన.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని కాదు. కేవలం భద్రతకు సంబంధించింది మాత్రమే. గ్రీన్‌లాండ్ ఇక మీదట కూడా డెన్మార్క్ రాజ్యంలోనే కొనసాగుతుందని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అక్కడి ప్రజల స్వయం నిర్ణయ హక్కును ఒప్పందం గుర్తిస్తుందని డెన్మార్క్ స్పష్టం చేసింది.
అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అనంతరం అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది.
కొత్త ఒప్పందం.. రష్యా, చైనాకు చెక్
గ్రీన్‌లాండ్‌లో అమెరికా ప్రత్యర్థి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా రష్యా, చైనాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక ఉనికిని పెంచడం లేదా సున్నితమైన పెట్టుబడులు పెట్టడం అమెరికా అనుమతి లేకుండా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో పిటుఫిక్ స్పేస్ బేస్‌ను నిర్వహిస్తోంది. క్షిపణి హెచ్చరికలు, క్షిపణి రక్షణ, అంతరిక్ష నిఘా వంటి కార్యకలాపాల్లో ఈ స్థావరం కీలకంగా ఉంది. కొత్త ఒప్పందంతో గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఏర్పడినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యకు అర్థమేంటి?
ఈ ఒప్పందానికి గడువు ఉండదనే అర్థంలో ట్రంప్ దీనిని ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్, అమెరికా భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. గ్రీన్‌లాండ్‌లో పెద్ద ఎత్తున అమెరికా సైనిక ఉనికిని అభివృద్ధి చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు.
ఎందుకంత కీలకం?
ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్‌లాండ్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య ఉన్న ప్రాంతంలో దాని స్థానం కారణంగా అమెరికా రక్షణ వ్యూహంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై అమెరికా దృష్టి మరింత పెరిగింది.
ట్రంప్ పాత డిమాండ్‌కు భిన్నంగా..
గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ గతంలో పలుమార్లు వ్యక్తం చేశారు. అవసరమైతే బలప్రయోగాన్ని కూడా తోసిపుచ్చని ఆయన వైఖరి డెన్మార్క్‌తో పాటు ఇతర నాటో దేశాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. తాజా ఒప్పందం మాత్రం గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం లేదా దాని సార్వభౌమాధికారాన్ని మార్చడం కాకుండా.. భద్రత, సైనిక ఉనికిపై అమెరికా పాత్రను విస్తరించే దిశగా ఉంది.
డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ఈ ఒప్పందం.. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నాటో, యూరప్‌కు కూడా ప్రయోజనకరమని అన్నారు. గ్రీన్‌లాండ్ ప్రభుత్వ అధిపతి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందం గ్రీన్‌లాండ్, డెన్మార్క్, అమెరికా, పాశ్చాత్య కూటమి భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: మీడియాను తొక్కిపారేస్తున్న ట్రంప్


