13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?! | 13 Year Old Bangladeshi Girl Fights for Infant Son After Child Marriage Viral | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!

Sep 19 2026 9:28 AM | Updated on Sep 19 2026 10:13 AM

13 Year Old Bangladeshi Girl Fights for Infant Son After Child Marriage Viral

ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

అనామికా అకర్త్‌కు సోషల్‌ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.

‘ఆమె కూడా ఇంకా చిన్నారే’
ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్‌ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్‌ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది.  

కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రం
బంగ్లాదేశ్‌లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్‌ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్‌ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement