భర్తకు మొదటి భార్యతో అనుబంధం.. రెండో భార్యకు మరో వ్యక్తితో రహస్య సంబంధం. ఈ వరుస బంధాల మధ్య రగిలిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. నిద్రలో ఉన్న భర్తను రెండో భార్య తన ప్రియుడితో హత్య చేయించి, మృతదేహాన్ని చెక్కపెట్టెలో దాచి.. అర్ధరాత్రి ఈ-రిక్షాలో కాలువ వంతెన కింద పడేసింది. రెండు రోజుల తర్వాత బయటపడిన ఈ కేసులో భార్య, ప్రియుడు సహా నలుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో, రెండు భార్యతో పాటు ఆమె ప్రియుడు, అతడి సహాయకుడిని అరెస్టు చేయగా.. మహిళ మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. రామ్‌కిశోర్ వాల్మీకి, కవితా దేవికి వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అనంతరం, సుఫియా బానోకు రామ్‌కిశోర్ వాల్మీకితో నాలుగేళ్లుగా పరిచయం ఉండగా, రెండేళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే సుఫియాకు మున్నా అలియాస్ ముచ్చడ్ (52)తోనూ సంబంధం ఏర్పడింది. ఈ విషయం రామ్‌కిశోర్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే సమయంలో రామ్‌కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుస్తూ, ఆమెకు ఆర్థిక సహాయం చేయడం సుఫియాకు నచ్చలేదు. దీంతో మున్నా, అతడి సహచరుడు మహమ్మద్ ఇక్బాల్ అలియాస్ బాసిర్ అహ్మద్ (40)తో కలిసి సుఫియా భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు డీసీపీ మహమ్మద్ ముస్తాక్ తెలిపారు.
Lucknow Murder: दूसरी पत्नी के अवैध संबंधों की राह में रोड़ा बना तो सोफिया बानो ने रामकिशोर वाल्मीकि को मार डाला.. #LucknowCrime #CrimeStory #UpPolice pic.twitter.com/dTd5wGZFhf
— UP Tak (@UPTakOfficial) September 18, 2026
సెప్టెంబర్ 14-15 అర్ధరాత్రి రామ్‌కిశోర్ నిద్రిస్తున్న సమయంలో సుఫియా ఇంటి తలుపు గడియ వేయకుండా ఉంచిందని, లోపలికి వచ్చిన ఇద్దరు నిందితులు కత్తితో పొడిచి అతడిని హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆధారాలు చెరిపేందుకు నిందితులు ఇంటి నేలను శుభ్రం చేసి, రక్తపు మరకలున్న చీపురు, బాధితుడి దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తిని దాచినట్లు తెలిపారు. ఆ తర్వాత సుఫియా తన 16 ఏళ్ల కుమారుడిని పిలవగా, నలుగురూ కలిసి మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. సెప్టెంబర్ 15-16 రాత్రి ఈ-రిక్షాలో మృతదేహాన్ని తరలించి, కనఖా ప్రాంతంలోని భవాఖడా వద్ద కాలువ వంతెన కింద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సెప్టెంబర్ 17న రామ్‌కిశోర్ మొదటి భార్య కవితా దేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత మార్గంలోని 170 నుంచి 180 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. శుక్రవారం సుఫియా, మున్నా, ఇక్బాల్‌ను అరెస్టు చేయగా, ఆమె మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తి, మృతదేహాన్ని తరలించిన ఈ-రిక్షాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: రాములమ్మ.. ఎంత పనిచేశావ్..


