పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలుత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సాంచిత తన నామినేషన్ ఉపసంహరించుకోవడం.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆపై కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం తరఫున బరిలో ఉన్న సాంచితా ప్రధాన్ డే శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారితో భేటీ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణాంపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వర్గం ఇక నందిగ్రామ్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టబోదని ప్రకటించి.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మిలన్ ప్రధాన్‌కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సైతం ఖుషీ అయ్యింది.
అయితే మమతా మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయనపై ఇప్పటికే పలు కేసులు, అరెస్టు వారెంట్ ఉన్నాయని చెబుతున్నారు.
నందిగ్రామ్ సోనాచూరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మిలన్ ప్రధాన్. 2007 భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీతో కలిసి చురుకుగా పనిచేశారు. అప్పటి నుంచి నందిగ్రామ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్ నందిగ్రామ్ టికెట్ ఇచ్చింది. సరిగ్గా ఇదేసమయంలో.. పెండింగ్ వారెంట్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.
మిలన్ ప్రధాన్‌ను శుక్రవారం రాత్రి పుర్బా మేదినీపూర్‌లోని ఓ హోటల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత 2007 కేసులో పెండింగ్ వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 19) హల్దియా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ అరెస్ట్‌ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్‌ల ఎదుట ధర్నా చేపట్టాలని కేడర్‌కు పిలుపు ఇచ్చింది. అలాగే ‘నందిగ్రామ్ చలో’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.
‘ఇది యాదృచ్ఛికం కాదు’..
మిలన్ ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. దీనిని ‘ఓటు చోరీ’, ‘ఎన్నికల చోరీ’గా అభివర్ణించారు. బీజేపీ ఉపఎన్నికలోనూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ‘మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అని చెప్పుకుంటుంటే.. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ.. మిలన్ ప్రధాన్ అరెస్టు యాదృచ్ఛికం కాదని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు, ప్రభుత్వాలు, పార్టీలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ భయపడబోదని, పోరాడుతుందని పేర్కొన్నారు.
‘ఎందుకీ సమయంలోనే?’.. మమతా ప్రశ్న
మమతా బెనర్జీ సైతం అరెస్టు సమయాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మిలన్ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. పాత కేసును ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. బీజేపీ ‘రాజకీయ కక్ష సాధింపు’తో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఏమంటోంది?
మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. పాత కేసులో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్య జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్‌ను హసిరాణి రథ్‌కు ఇచ్చింది. తన దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి.. దారుణ హత్యకు గురైన చంద్రనాథ్ తల్లి ఆవిడ. అందుకే సువేందు ఆమెకు టికెట్ ఇప్పించారు. దీంతో నందిగ్రామ్‌లో పోటీ ప్రధాన పార్టీల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.
రితబ్రత బెనర్జీ ఎదురుదాడి
మరోవైపు టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ మాత్రం మమతా వర్గం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడు రోజులుగా నందిగ్రామ్‌ను కాంగ్రెస్‌కు వదిలేసి.. రిజీనగర్‌లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించకపోవడంతో మమతా అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ వర్గం అభ్యర్థి అకస్మాత్తుగా నామినేషన్ ఉపసంహరించుకోవడం కూడా ఒక ‘ఫిక్స్’లో భాగమేనని ఆయన ఆరోపించారు. మమతా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని రితబ్రత బెనర్జీ ‘అసంతృప్తితో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు.
అసలు వివాదం ఇక్కడే..
బెంగాల్ రాజకీయ చదరంగంలో విపక్షాలకు ఒకే ఒక్కరోజులో భారీ షాకిచ్చింది. పార్టీ చీలిక కారణంగా.. అక్టోబర్ 6న జరగాల్సిన నందిగ్రామ్, రిజీనగర్ ఉప ఎన్నికలకు ఈసీ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పార్టీ పేరు, గుర్తు దూరం అయ్యాయి. ఆ వెంటనే నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ, మమతా కాంగ్రెస్‌కు మద్దతు.. ఆ వెంటనే ఆ అభ్యర్థి అరెస్టు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: బలవంతంగా ఆయన్ని రిటైర్ చేశారా?


