సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్లు నిర్ధారించి, శాసనసభ్య సభ్యత్వం కోల్పోతున్నట్లు స్పష్టం చేసింది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడాన్ని హైకోర్టు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మరియు ఉత్తర్వులను కోర్టు పూర్తిగా కొట్టివేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 మార్చి 17న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీ-ఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
దీంతో, బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన ఆయనపై శాసనసభ్య సభ్యత్వం నుంచి అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ క్లీన్‌చిట్.. హైకోర్టులో సవాల్
ప్రతిపక్ష నేతల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ ఏడాది మార్చి 11న సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్‌చిట్ ఇస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.
స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పిన న్యాయస్థానం.. దానం నాగేందర్ ఎంపీగా పోటీచేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు దానం నాగేందర్ కొంత సమయం కోరగా, ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

ఇదీ చదవండి : దానం తీర్పు.. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల టెన్షన్!


