ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఆరోపించింది. ఒసామా బిన్ లాడెన్ సహా 9/11 ఉగ్రదాడుల కుట్రదారులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాక్కోలేదని, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనూ ఎవరి కంటికీ చిక్కకుండా ఉండిపోయారని, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు, శిక్ష నుంచి మినహాయింపు కల్పించే ఇలాంటి వాతావరణం పాకిస్తాన్‌లో కొనసాగినంత కాలం.. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు లాభమే చేకూరుతుందని తీవ్రంగా విమర్శించింది.
ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై భద్రతా మండలి జరిగిన సమావేశంలో భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, ఖలీద్ షేక్ మహ్మద్ తదితరులు పాకిస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోనే పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఒసామా అబోతాబాద్‌లో భద్రత కలిగిన నివాస భవనంలో హతమయ్యాడని, 9/11 దాడుల రూపకర్త ఖలీద్ షేక్ మహ్మద్ రావల్పిండిలోని ఇంట్లో పట్టుబడ్డాడని ఆయన వివరించారు. ఈ దాడులకు సంబంధించిన ఉగ్రవాదులు రమ్జీ బినల్‌షిబ్, వలీద్ బిన్ అతాష్, ముస్తఫా అహ్మద్ అల్ హౌసావీ కూడా పాకిస్థాన్‌లోనే అరెస్టయ్యారని తెలిపారు.
‘‘వీరు గుహల్లో దాక్కోలేదు. పరారీలోనూ లేరు. ఎవరూ గుర్తించకుండా ఉండగలిగారు. ఇలాంటి రాక్షసులు ఎదిగేందుకు సహకరించిన వాతావరణాన్ని తొలగించాలి’’అని పర్వతనేని పాకిస్తాన్‌పై పరోక్ష విమర్శలకు దిగారు. పాకిస్తాన్ 9/11 దాడుల వెనుక ఉన్న వారికి కల్పించినట్టుగానే అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు ఆశ్రయం, మద్దతు ఇస్తూనే ఉందని ఆరోపించారు. ఈ సంస్థలు ఆంక్షల వేటు తప్పించుకునేందుకు పేర్లు మార్చుకుంటున్నాయని అన్నారు.
అఫ్గన్ శరణార్థులపై ఆందోళన
పలు దేశాల నుంచి అప్గన్‌లను అఫ్గనిస్థాన్‌కు తిరిగి పంపుతున్న వారిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది 29 లక్షల మంది 2026 ఆగస్టు 22 వరకు మరో 11.5 లక్షల మంది తిరిగి వెళ్లినట్లు ఐరాస నివేదిక చెబుతుండగా వీరిలో అత్యధికులను బలవంతంగా తిప్పి పంపారని భారత్ ఆరోపించింది. ఈ ప్రక్రియ స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా ఉండాలని స్పష్టం చేసింది. పునరావాసం, ఆహారం, నివాసం వంటి అవసరాల కోసం అంతర్జాతీయ సమాజం తగిన తోడ్పాటును అందించాలని, తమవంతుగా ఐరాస, అఫ్గన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా


