రష్యాపై ఆంక్షలు | USA House passes Russia sanctions, impose up to 100percent tariffs | Sakshi
Sakshi News home page

రష్యాపై ఆంక్షలు

Sep 18 2026 5:45 AM | Updated on Sep 18 2026 5:45 AM

USA House passes Russia sanctions, impose up to 100percent tariffs

చైనా, భారత్‌లపై భారీ టారిఫ్‌ల వడ్డన 

బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఓకే

వాషింగ్టన్‌: రష్యాపై ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోళ్లు చేస్తున్న భారత్, చైనాలపై భారీ ఎత్తున టారిఫ్‌లు విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ‘ద లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ 2026’పేరున్న ఈ చట్టాన్ని సెనేట్‌ గత నెలలోనే ఆమోదించింది. 

తాజాగా బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ 262–159 ఓట్లతో ఓకే చెప్పింది. అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం పెట్టిన వెంటనే ఈ బిల్లు కాస్తా చట్టం అవుతుంది. ప్రతినిధుల సభలోని 203 మంది రిపబ్లికన్లతోపాటు 56 మంది డెమొక్రాట్లు, ఒక స్వతంత్ర ప్రతినిధి ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. ప్రతిపక్ష డెమొక్రాట్‌ పార్టీ ప్రతినిధులు ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి పరిమితమయ్యారు. 

సౌత్‌ కరొలీనా సెనేటర్, రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి లిండ్సే గ్రాహం ఏడాది కాలంగా ఈ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి.. ఈ ఏడాది జూలైలో ఆకస్మిక మరణం పాలయ్యారు. దీంతో బిల్లుకు గ్రాహం పేరునే పెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో డెమొక్రాట్‌ ప్రతినిధి రిచర్డ్‌ నీల్‌ మాట్లాడుతూ ‘‘టారిఫ్‌లు విధించే విషయంలో ట్రంప్‌కు ఎక్కువ అధికారాలు ఇవ్వడంపై మాత్రమే తమ అభ్యంతరం’’అని స్పష్టం చేశారు. 

ఈ బిల్లు ద్వారా రష్యా నేతలపై మాత్రమే కాకుండా ఇంధన రంగం మొత్తమ్మీద ఆంక్షలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు కట్టబెట్టనుంది. అధికారికంగా ఇంధన సరఫరా చేసే నౌకలతోపాటు ‘షాడో ఫ్లీట్‌’లకు కూడా ఆంక్షలు వర్తించనున్నాయి. అదే సమయంలో రష్యా సరఫరా చేసే చమురు, గ్యాస్‌లపై భారత్, చైనా వంటి దేశాలు ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలపై టారిఫ్‌లు వడ్డించేందుకు ఈ బిల్లు ట్రంప్‌కు అధికారం ఇస్తుంది.

  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. సెనేట్‌ ఈ బిల్లును నెలరోజుల క్రితమే 86–11 ఓట్ల తేడాతో ఆమోదించగా ప్రతినిధుల సభలో కొంత ఆలస్యమైంది. నవంబరు మూడున జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభ సమావేశాల చివరిరోజున మాత్రమే ఆమోదం సాధ్యమవడం విశేషం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement