రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.
అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
భారత్ స్పందన..
బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది.
రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది.
ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.

ట్రంప్ డెస్క్ మీద..
అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది.
రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది.
ఇక భారత్‌పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.
ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు?


