తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీశన్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ బయటకొచ్చిన పత్రాలు.. ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసుకు దారితీశాయి. కాగా, ఆ పత్రాలు నకిలీవని ఆరోపిస్తూ రిపోర్టర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో అగస్టిన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేపీసీసీ అధికార ప్రతినిధి రాజు పి. నాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అగస్టిన్‌ను మొదటి నిందితుడిగా చేర్చగా.. మరో ఇద్దరిని గుర్తు తెలియని నిందితులుగా పేర్కొన్నారు.
వివాదం ఎలా మొదలైందంటే.. 2012లో కర్ణాటకలో సతీశన్ మరో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు పేర్కొంటున్న కొన్ని పత్రాలతో ఇద్దరు వ్యక్తులు తన కార్యాలయానికి వచ్చారని ఆంటో అగస్టిన్ తెలిపారు. అప్పటికే సతీశన్‌కు వివాహం జరిగి ఉందని చెబుతూ ఆ పత్రాలను తనకు చూపించారని వెల్లడించారు. అయితే పత్రాలను పరిశీలించిన తర్వాత అవి నకిలీవని తేలడంతో తమ సంస్థ ఆ కథనాన్ని ప్రసారం చేయలేదని అగస్టిన్ చెప్పారు. అయినప్పటికీ ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ వ్యవహారంపై రాజు పి. నాయర్ పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం కోసం కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో కేరళ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, క్రిమినల్ కుట్ర, పరువునష్టం కలిగించే సమాచార ప్రచురణకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు రిపోర్టర్ టీవీపై సిట్ సోదాలు
ఇదే రోజున రిపోర్టర్ టీవీ, ఆ సంస్థ ప్రమోటర్లకు సంబంధించిన ప్రాంగణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోదాలు నిర్వహించడం మరింత చర్చకు దారితీసింది. లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టును కేరళకు తీసుకురావాలన్న విఫల ప్రయత్నానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా కొచ్చి, వయనాడ్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్లతో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
సోదాల సమయంలో జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపయోగించే మొబైల్ ఫోన్లను పోలీసులు తీసుకెళ్లారని రిపోర్టర్ టీవీ ఆరోపించింది. అయితే పోలీసులు ఈ వాదనను ఖండించారు. ఎలాంటి ఫోన్లను స్వాధీనం చేసుకోలేదని, దర్యాప్తుకు అవసరమైన పత్రాల కోసమే సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మీడియా స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తాయి. సీఎం సతీశన్ మాత్రం సోదాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని, ప్రభుత్వం దర్యాప్తులో జోక్యం చేసుకోదని తెలిపారు. ఇలా సీఎం ‘రెండో పెళ్లి’ అంటూ మొదలైన వివాదం.. నకిలీ పత్రాల ఆరోపణలు, పోలీస్ కేసు, టీవీ ఛానల్‌పై సోదాలతో మరింత ముదిరింది. అసలు ఆ పత్రాలు ఎలా వచ్చాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై ఇప్పుడు పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
ఇదీ చదవండి: అంతరిక్ష యుద్ధానికి మనం సిద్దమా?


