అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది. రష్యా, చైనా లాంటి దేశాలు అంతరిక్ష యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నట్లు వార్తలు వస్తూండగా.... అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్ పరిస్థితి ఏమిటి? ఉపగ్రహాలను కూల్చే సత్తా మనకుందా? ఉంటే.. అమెరికా మాదిరిగానే మనమూ అంతరిక్షంలో మనదైన అ్రస్తాన్ని సిద్ధంగా ఉంచగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో...
ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా భారత్‌కు ఇప్పుడు కాదు... ఏడేళ్ల క్రితం అంటే 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను భారత్ పరీక్షించింది. అగ్రరాజ్యాలు అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో పురుడుపోసుకున్న ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధాల ఆలోచన ఆ తరువాత బహుముఖంగా విస్తరించింది.
అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్‌ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది కూడా. ఇలా క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్‌లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించని, నిత్యం కదులుతూ ఉండే ఉపగ్రహాలను గుర్తించడం, క్షిపణులతో ఢీకొట్టడం అంతా చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దేశాలు మాత్రమే ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగాయి. 1985లో అమెరికా మొట్టమొదటిసారి ఈ రకమైన వ్యవస్థలను ప్రయోగించి విజయం సాధిస్తే చైనాకు 2007 వరకూ సాధ్యపడలేదు. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్‌లు ఉన్నాయని ప్రకటించుకుంది.
మన పరిస్థితి ఏమిటి?
ముందుగా చెప్పుకున్నట్లు మిషన్ శక్తితో మనకు ఉపగ్రహాలను కూల్చేయగల సామర్థ్యం సమకూరింది. ఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. నేరుగా ఢీకొట్టడం ద్వారా మాత్రమే పృథ్వీ క్షిపణి ఉపగ్రహాన్ని నాశనం చేయడం గుర్తించాల్సిన విషయం. అంటే.. క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదన్నమాట. ప్రయోగం తరువాత జరిపిన పరిశీలనల్లో క్షిపణి ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడంలో విజయవంతమైందని స్పష్టంగా తెలిసింది. దీనర్థం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను గుర్తించి.. దాని దారిని పరిశీలిస్తూ... అడ్డుకుని పేల్చేయగల సత్తా భారత్‌కు ఉందీ అని!!! ఇప్పుడు çపృథ్వీ క్షిపణిలో పేలుడు పదార్థం ఉందని ఒక్కసారి ఊహించుకోండి...
– సాక్షి, నేషనల్ డెస్క్


